ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక రన్స్ చేసిన టాప్ 10 ప్లేయర్లు వీళ్లే! లిస్ట్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ నెల అంటే ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. పాకిస్థాన్, దుబాయ్ ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. టీమిండియా మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్టింగ్ కంట్రీ పాకిస్థాన్ అయినప్పటికీ భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ ఒప్పుకోకపోవడంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నారు. అంటే రెండు వేదికల్లో టోర్నీ జరగనుంది. భారత మ్యాచ్‌లు దుబాయ్‌లో, మిగిలిన మ్యాచ్‌లు పాక్‌లో జరుగుతాయి.
SN Pasha |
Updated on: Feb 14, 2025 | 6:07 PM

భారత అభిమానులంతా ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మెరుపుల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 23న ఇండియా - పాక్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అయితే.. ఇప్పటి వరకు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలు అన్ని కలుపుకొని.. అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 బ్యాటర్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఛాంపియన్స్ ట్రోఫీల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీల్లో మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన గేల్ 791 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు,ఒ క హాఫ్ సెంచరీ ఉంది. అత్యధిక స్కోర్ 113. ఇక రెండో స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే ఉన్నాడు. ఇతను 22 మ్యాచ్‌లు ఆడి 742 పరుగులు సాధించాడు. అందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇక మూడో స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఉన్నాడు. ధావన్ 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలు ఆడాడు. ఆ రెండు టోర్నీల్లో కూడా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ అతనే. మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన ధావన్ 701 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక నాలుగో ప్లేస్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగార్కర ఉన్నాడు. ఇతను 22 మ్యాచ్‌ల్లో 683 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఐదో స్థానంలో టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నాడు. దాదా 13 మ్యాచ్‌ల్లో 665 పరుగులు సాధించాడు. అందులో మూడో సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 141. దాదా కెప్టెన్సీలో 2000వ ఏడాది ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది. 2002లో ఫైనల్ మ్యాచ్ రద్దు కావడంతో శ్రీలంకతో కలిసి ట్రోఫీని భారత్ పంచుకుంది. ఇక ఆరో స్థానంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కల్లీస్ ఉన్నాడు. ఇతను 17 మ్యాచ్‌ల్లో 653 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇక ఏడో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ద్రవిడ్ 19 మ్యాచ్‌ల్లో 627 పరుగులు సాధించాడు. అందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 8వ స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్ 18 మ్యాచ్‌ల్లో 593 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాంటింగ్ అత్యధిక స్కోర్ 111 (నాటౌట్)

ఇక 9వ స్థానంలో వెస్టిండీస్ మాజీ దిగ్గజ క్రికెటర్ చంద్రపాల్ ఉన్నాడు. ఇతను 16 మ్యాచ్‌ల్లో 587 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చంద్రపాల్ అత్యధిక స్కోర్ 74. ఇక చివరిగా పదో స్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య 20 మ్యాచ్‌ల్లో 536 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది. మొత్తంగా టాప్ 10లో ముగ్గురు భారత క్రికెటర్లు ఉన్నారు. 11వ స్థానంలో విరాట్ కోహ్లీ 529 పరుగులతో ఉన్నాడు. ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీతో కోహ్లీ టాప్ 10లో ప్రవేశించే అవకాశం ఉంది. మంచి ప్రదర్శన కనబరిస్తే.. నంబర్ ప్లేస్‌కి కూడా చేరుకున్నా ఆశ్చర్యం లేదు. 173 పరుగుల చేస్తే టీమిండియా తరఫున టాప్ వన్‌లో ఉంటాడు. ద్రవిడ్, దాదా, ధావన్‌లను దాటేస్తాడు. 263 పరుగులు చేస్తే గేల్‌ను కూడా దాటేసి.. వరల్డ్ నంబర్ వన్‌గా నిలుస్తాడు.





























