- Telugu News Photo Gallery Cricket photos RCB defeated Gujarat Giants by 8 wickets with Sophie Devine's 99 runs cricket Fans Recall its Chris Gayle style
Sophie Devine: 8 సిక్సర్లు.. 9 ఫోర్లు.. 36 బంతుల్లో 99 పరుగులు.. ‘లేడీ క్రిస్ గేల్’ విధ్వంసం..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ క్రికెటర్ సోఫీ డివైన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. గుజరాత్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన ఆమె ఆటతీరును చూసి.. క్రీడాభిమానులు ‘లేడీ క్రిస్‌గేల్’ అంటూ సంబోధిస్తున్నారు. ఇంకా..
Updated on: Mar 19, 2023 | 3:35 PM

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ రోజురోజుకు మరింత ఉత్కంఠగా సాగుతోంది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించే దశకు చేరి.. ముందుకు సాగడం కష్టమేననే పరిస్థితిలో పడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు ఇప్పుడు వరుస విజయాలు సాధించి ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది.

శనివారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ మహిళా బ్యాట్స్ ఉమెన్ రెచ్చిపోయారు. ముఖ్యంగా న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్ విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో.. తన జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది.

ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో 36 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సోఫీ డివైన్ 8 సిక్సర్లు, 9 ఫోర్లతో 99 పరుగుల చేసి ఔటైంది. దీంతో 1 పరుగు తేడాతో సెంచరీ కోల్పోయింది. అయితేనేం.. ఆర్సీబీ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ మళ్లీ జట్టులోకి వచ్చినట్లుందని ఆర్‌సీబీ అభిమానులు సంబరపడుతున్నారు. ఇక మ్యాచ్ అనంతరం సోఫీ డివైన్ ఏం మాట్లాడిందంటే..

‘ప్లే ఆఫ్ రేసులో మేం ఇంకా బతికే ఉన్నాం. భారత్‌లో ఆడిన నేను కొన్ని మ్యాచ్‌లను గమనించాను. ప్రతిరోజూ మనం ఇక్కడ ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఒకప్పుడు ఈ వాతావరణం చాలా కష్టంగా ఉండేది. అందుకే చాలా మంది బౌలర్లు తడబడ్డారు. 99 పరుగుల వద్ద ఔట్ అయినందుకు బాధగా లేదు. జట్టుకు సహకారం అందించడం చాలా ముఖ్యమ’ని సోఫీ డివైన్ పేర్కొంది.

తొలుత బ్యాటింగ్ చేసి గుజరాత్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని.. ఆర్సీబీ 15.3 ఓవర్లలో 2 వికెట్లు నష్టంతోనే చేధించి, విజయం సాధించింది. సోఫీ, కెప్టెన్ స్మృతి మందన (37) తొలి వికెట్ భాగస్వామ్యానికి 125 పరుగులు చేశారు. సోఫీ తాను ఎదుర్కొన్న బంతులను తనకు ఇష్టమైనట్లుగా మలుచుకుంటూ బౌండరీల అవతలకు పంపించింది. అయితే 1 పరుగుతో సెంచరీ కోల్పోయి ఔటైన సోఫీ.. టీ20 క్రికెట్ అభిమానులను మాత్రం అద్దిరిపోయేలా ఎంటర్‌టైన్ చేసింది.

అయితే న్యూజిలాండ్ జట్టులో బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన సోఫీ ఆ తర్వాత ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోఫీకి టీ20లో అత్యుత్తమ ప్రదర్శన ఇదే.

స్మృతి(37)-సోఫీ(99) నిష్క్రమణ తర్వాత ఎలిస్ పెర్రీ(19 నాటౌట్), హీథర్ నైట్(22 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆర్సీబీ మరో 27 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ లారా వోల్వార్డ్ (68) అర్ధ సెంచరీ, గార్డనర్ (41) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్‌సీబీ తరఫున శ్రీయాంక పాటిల్ 2 వికెట్లు, ప్రీతి బోస్ 1, సోఫీ డివైన్ 1 వికెట్ తీసుకున్నారు.

అయితే శనివారం సోఫీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులకు తెగ నచ్చేసింది. సోఫీ ఇన్నింగ్స్‌ను చూస్తుంటే.. గతంలో ఆర్‌సీబీ తరఫున ఆడిన క్రిక్ గేల్ గుర్తుకు వస్తున్నాడని, సోఫీ ‘లేడీ క్రిస్ గేల్’ అంటూ నెట్టింట తెగ పోస్టులు పెడుతున్నారు.
