- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Batsmen with Most Sixes in 20th Over in Indian Premier League
IPL 2023: ‘20వ ఓవర్’ సిక్సర్ వీరులలో ధోనిదే అగ్రస్థానం.. ‘అత్యుత్తమ ఫినిషర్’ అనడానికి ఈ లెక్కలు సరిపోవా..?
ఎంఎస్ ధోని.. మ్యాచ్ ఏ దశలో ఉన్నా సిక్సర్ బాదడం ధోని స్పెషల్. ఇక మ్యాచ్ చివరి ఓవర్‌లో లేదా మ్యాచ్ చివరి దశలో సిక్సర్ బాదాలంటే ధోనినే. అందుకే ధోనిని బెస్ట్ ఫినిషర్ అంటారు. ఇదే విషయాన్ని ధోని ఐపీఎల్ చరిత్రలో ఎన్నో సార్లు చేసి చూపాడు. ఇటీవల తన నాయకత్వంలోని చెన్నై ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ధోని 20వ ఓవర్‌లో వచ్చి సిక్సర్లు కొట్టి అభిమానులను వినోదపరిచాడు.
Updated on: Apr 05, 2023 | 4:47 PM

ఐపీఎల్ 2023: క్రికెట్ ఫీల్డ్‌లో బెస్ట్ ఫినిషర్ ఎవరు అనే ప్రశ్నకు ఎక్కువ మంది ఇచ్చే సమాధానం మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 2 మ్యాచ్‌లలో కూడా ఇదే నిజమైంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా చివరి ఓవర్లోనే సిక్సర్ కొట్టిన ధోని.. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 20వ ఓవర్లో 2 భారీ సిక్సర్లు బాదాడు.

ముఖ్యంగా ఏప్రీల్ 3న చెన్నై, లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని సేన 12 వికెట్ల తేడాతో గెలిచింది. చివరి ఓవర్లో ధోని కొట్టిన 2 సిక్సర్ల(12 పరుగులు)తో చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 217కి చేరింది. దీనిని చేధించే క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ 205 పరుగులకే ఆలౌటైంది. అంటే.. ధోని కొట్టిన 2 సిక్సర్లతోనే సీఎస్‌కే గెలిచిందనడంతో అతిశయోక్తి లేదు.

అయితే చివరి ఓవర్‌లో సిక్సర్ బాదడం అనేది ధోనికి కొత్తేమి కాదు, ఇంకా తొలిసారి అసలే కాదు. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా మహేంద్ర సింగ్ ధోనీ పేరిటే ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం...

1. మహేంద్ర సింగ్ ధోనీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని ఐపీఎల్‌లో ఇప్పటివరకు 20 ఓవర్లలో 277 బంతులను ఎదుర్కొని 679 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం 55 సిక్సర్లు కూడా ఉండడం విశేషం. అంటే ఐపీఎల్ మ్యాచ్ 20వ ఓవర్‌లో ధోని మొత్తం 55 సిక్సర్లు బాదాడు.

2. కీరన్ పొలార్డ్: ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు కీరన్ పొలార్డ్ 20వ ఓవర్లో 62 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 33 సిక్సర్లు బాది, 20వ ఓవర్ సిక్సర్ వీరుల ధోని తర్వాత అంటే 2వ స్థానంలో నిలిచాడు.

3. రవీంద్ర జడేజా: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా 20వ ఓవర్‌లో 62 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. ఈ సందర్భాలలో జడ్డూ తన బ్యాట్‌తో 26 సిక్సర్లు బాదాడు.

4. హార్దిక్ పాండ్యా: ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా 20వ ఓవర్లో 36 సార్లు బ్యాటింగ్ చేశాడు. అందులో హార్దిక్ 25 సిక్సర్లు కొట్టి.. ఈ లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నాడు.

5. రోహిత్ శర్మ: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 20వ ఓవర్లో 27 సార్లు బ్యాటింగ్ చేసి 23 సిక్సర్లు బాదాడు.

అంటే ఐపీఎల్ చరిత్రలో ధోనీ మినహా మరే ఇతర బ్యాట్స్‌మ్యాన్ 20వ ఓవర్లో 50కి మించి సిక్సర్లు బాదలేదు. క్రికెట్ మైదానంలో మహేంద్ర సింగ్ ధోనీ అత్యుత్తమ ఫినిషర్ అనడానికి ఇదే నిదర్శనం.




