- Telugu News Photo Gallery Cricket photos Indian Men and Women’s cricket team to make debut in Asian Games 2023, says Report
Asian Games 2023: క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. ‘ఏషియన్ గేమ్స్’లో భారత మహిళల, పురుషుల జట్లు.. అసలు ట్విస్ట్ ఏమిటంటే..?
Asian Games 2023: టీ20 ఫార్మాట్‌లో జరిగే ఏషియన్ గేమ్స్ క్రికెట్‌లో బీసీసీఐ జూన్ 30లోపు ఆటగాళ్ల జాబితాను భారత ఒలింపిక్ సంస్థకు అందజేస్తుంది. అయితే ఇందులోనే ఓ ట్విస్ట్ ఉంది. అదేమిటంటే..
Updated on: Jun 24, 2023 | 3:22 PM

Asian Games 2023: భారత్ వేదికగా ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియాను బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్న బీసీసీఐ.. ఇప్పుడు వరల్డ్ కప్‌తో పాటు అదే సమయంలో ప్రారంభం కానున్న ఆసియా క్రీడలకు కూడా పురుషుల, మహిళల జట్లను పంపేందుకు అంగీకరించింది.

సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడలకు పూర్తిస్థాయి మహిళల జట్టును పంపాలని భావిస్తున్న బీసీసీఐ.. పురుషుల జట్టులో స్వల్ప మార్పు చేసింది. అదేమిటంటే.. సీనియర్ జట్టుకు బదులుగా టీమిండియా బి ఆసియా క్రీడల్లో పోటీపడనుంది.

ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ మేరకు బీసీసీఐ జూన్ 30లోపు తమ ఆటగాళ్ల జాబితాను భారత ఒలింపిక్ సంస్థకు సమర్పించనుంది. ప్రపంచకప్ షెడ్యూల్ నేపథ్యంలో ఆసియా క్రీడలకు టీమిండియాను పంపేందుకు గతంలో బీసీసీఐ అంగీకరించలేదు.

ఎందుకంటే 2023 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్‌జౌలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరగబోతున్నాయి. వన్డే ప్రపంచకప్ కూడా అదే సమయంలో అంటే అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఇలా బీజీ షెడ్యూల్ కుదరని నేపథ్యంలో భారత పురుషుల సీనియర్ జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనలేకపోతుంది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆసియా క్రీడలకు పురుషుల బీ జట్టును పంపుతుంది. చాలా మంది సీనియర్ స్టార్ ప్లేయర్లు భారత ప్రపంచ కప్ జట్టులో భాగం కానున్నారు. అయితే భారత క్రికెట్‌లో 2 నుంచి 3 జట్లను నిర్మించేంత మంది క్రికెట్ ప్రతిభ ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఆసియా క్రీడలకు పంపాలని బీసీసీఐ ఆలోచించిందని సమాచారం.

ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జూలై, ఆగస్టులలో బర్మింగ్‌హామ్‌లో జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్ జట్టు కనిపించి.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది.

క్రికెట్ ఆటను తొలిసారిగా 2010 ఆసియా క్రీడల్లో చేర్చారు. తర్వాత 2014 ఎడిషన్ వరకు క్రికెట్ ఆసియా క్రీడల్లో భాగంగా ఉంది. అయితే జకార్తాలో జరిగిన 2018 ఎడిషన్‌లో క్రికెట్‌ను ఆటల నుంచి తొలగించారు. ఆ తర్వాత క్రికెట్‌ను మళ్లీ 2022 గేమ్స్‌లో చేర్చారు కానీ కరోనా నేపథ్యంలో ఆటలు వాయిదా పడ్డాయి.





























