- Telugu News Photo Gallery Cricket photos Glenn Maxwell Ruled Out Of T20I Series Vs South Africa Due To Ankle Injury; 4th Player to drop from team
World Cup 2023: ఆస్ట్రేలియా జట్టు నుంచి ఆ నలుగురు ఔట్.. వాళ్లు లేకుంటే వరల్డ్‌కప్ ఆశలు గల్లంతే..!
World Cup 2023: భారత్ వేదికగా జరిగే ప్రపంచ కప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. అంటే క్రికెట్ మెగాటోర్నీకి ఇంకా 40 రోజుల సమయం కూడా లేదు. ఇలాంటి సమయంలో కంగారుల జట్టును గాయాలు కంగారు పెడుతున్నాయి. అవును, ఆస్ట్రేలియా జట్టులోని నలుగురు ప్లేయర్లు గాయల కారణంగా ఆటకు దూరమయ్యారు. పాట్ కమ్మిన్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ ముందుగానే గాయపడగా.. తాజాగా మరో ఆటగాడు గాయం కారణంతో జట్టుకు దూరమయ్యాడు.
Updated on: Aug 28, 2023 | 10:19 PM

Australia: ఆక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికా, భారత్‌తో వన్డే సిరీస్‌లు ఆడనుంది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగించుకుని భారత్‌కి ఆసీస్ జట్టు వచ్చి టీమిండియాతో కూడా వన్డే సరీస్ ఆడుతుంది. సెప్టెంబర్ 27తో ఈ రెండు సిరీస్‌లు ముగియనుండగా.. 29 నుంచి వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్‌లోకి వస్తుంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా సెప్టెంబర్ 29 నుంచి ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది.

అయితే దాని కంటే ముందు ఆస్ట్రేలియాను గాయాలు వెంటాడుతున్నాయి. వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియాకు ప్రాణం పోయగల ఆ ఆటగాళ్లు జట్టుకు దూరమైతే.. కంగారుల జట్టు కంగారు పడకతప్పదు. ఇంతకీ గాయాల కారణంగా ఆటకు దూరమైన ఆ ఆటగాళ్లెవరంటే..

పాట్ కమిన్స్: ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. యాషెస్ సిరీస్ తర్వాత ఏ టోర్నీలోనూ కనిపించని కంగారుల కెప్టెన్.. సౌతాఫ్రికా టూర్‌కి కూడా దూరమయ్యాడు. సౌతాఫ్రికా తర్వాత భారత్‌కి వచ్చే జట్టులో అతను ఉంటాడా లేదా అన్నది సందేహంగా మారింది.

స్టీవ్ స్మిత్: ఆస్ట్రేలియా జట్టుకు బ్యాటింగ్ వెన్నెముకగా సేవలందిస్తున్న స్టీవ్ స్మిత్ కూడా ఎడమ మణికట్టు నొప్పితో ఆటకు దూరమయ్యాడు. అలాగే దక్షిణాఫ్రికా టూర్ నుంచి వైదొలిగాడు. స్మిత్ వరల్డ్‌కప్ కంటే ముందు కోలుకోకుంటే కంగారులు కష్టాలపాలైనట్లే..

మిచెల్ స్టార్క్: ఆసీస్ బౌలింగ్‌కి బలం అయిన మిచెల్ స్టార్క్ యాషెస్ సిరీస్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతను కూడా గాయం కారణంగా దక్షిణాఫ్రికా టూర్ నుంచి వైదొలిగాడు.

గ్లెన్ మాక్స్‌వెల్: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కూడా చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో మ్యాక్సీ కూడా సౌతాఫ్రికా టూర్ నుంచి తప్పుకున్నాడు.

కాగా, సెప్టెంబర్ 7 నుంచి దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ జరుగుతుంది. 3 వన్డేల భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో ఈ నలుగురు కనిపిస్తేనే వన్డే వరల్డ్‌కప్‌లో ఆడగలరు. ఈ నలుగురు లేకుంటే ఆస్ట్రేలియా జట్టు ప్రపంచకప్ టైటిల్‌పై ఆశలు వదులుకోవాల్సిందే..





























