- Telugu News Photo Gallery Cricket photos BGT 2024 25: Who is Tanush Kotian, India’s uncapped call up for the Australia Tests In Place Of Ravichandran Ashwin
IND Vs AUS: అశ్విన్ స్థానంలో 26 ఏళ్ల యంగ్ స్పిన్నర్.. అసలు ఎవరీ తనుష్ కోటియన్?
బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు తనుష్ కోటియన్ ఎంపికయ్యాడు. గతంలో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ ముంబై ఆటగాడు ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోని ఈ యువ స్పిన్నర్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకుని సక్సెస్ సాధించాడు.
Updated on: Dec 24, 2024 | 11:53 AM

పేరు తనుష్ కోటియన్.. వయసు కేవలం 26 సంవత్సరాలు.. రైట్ ఆర్మ్ స్పిన్నర్, రైట్ ఆర్మ్ బ్యాట్స్ మెన్. గత కొన్నేళ్లుగా ముంబై జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో టీమిండియాకు ఎంపికయ్యాడు. దీంతో అసలు ఎవరీ తనుష్ కోటియన్ అని క్రికెట్ లవర్స్ గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

కర్ణాటకకు చెందిన తనుష్ కోటియన్.. పెరిగిందంతా ముంబైలోనే. అలానే ముంబై జట్టుతో తన క్రికెట్ కెరీర్ మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి ఆల్ రౌండ్ ఆటతో అందరి దృష్టిని ఆకర్షించిన తనుష్‌కు ముంబై జూనియర్ జట్టులో చోటు దక్కేందుకు ఎంతో కాలం పట్టలేదు.

2018లో అంటే 20 ఏళ్ల వయసులో ముంబై తరఫున బరిలోకి దిగిన తనుష్ అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఈ యువ ఆల్ రౌండర్ తన ఆల్ రౌండ్ ఆటతో జట్టులో శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

తనుష్ కోటియన్ ఇప్పటి వరకు ముంబై తరపున 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన అతను 41.21 సగటుతో 1525 పరుగులు చేశాడు. 25.70 సగటుతో 101 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, అతని బ్యాట్ నుంచి 2 భారీ సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు వచ్చాయి.

2023-24లో ముంబై జట్టు రంజీ ట్రోఫీని గెలవడంలో తనుష్ కోటియన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 41.83 సగటుతో 502 పరుగులు చేయడమే కాకుండా 29 వికెట్లు తీశాడు. దీని ద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు.

దీని తర్వాత జరిగిన ఇరానీ కప్‌లో అద్బుతమైన సెంచరీ సాధించి 27 ఏళ్ల తర్వాత ముంబై జట్టు టైటిల్ గెలవడంలోనూ ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే దులీప్ ట్రోఫీలో భారత్ ఎ జట్టు తరఫున ఆడిన తనుష్ 3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించాడు.

ఇన్ని అద్భుత ప్రదర్శనల ఫలితంగా ఇప్పుడు టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో భారత జట్టుకు ఎంపికయ్యాడు. మెల్‌బోర్న్, సిడ్నీలలో జరిగే చివరి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో తనుష్ కోటియన్ భారత జట్టుకు బరిలోకి దిగే ఛాన్స్‌లు ఉన్నాయి.




