- Telugu News Photo Gallery Cricket photos BCCI Sent Big Message to Rohit Sharma Ahead Of Australia ODI Series check full details
Rohit Sharma: రోహిత్ ఓ తోపు ప్లేయర్.. తొలి వన్డేకు ముందే బీసీసీఐ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు మ్యాటర్ ఏంటంటే?
Team India: బీసీసీఐ పంపిన ఈ సానుకూల సందేశం రోహిత్ శర్మకు ఒక రకంగా బూస్టప్ ఇచ్చిందనే చెప్పవచ్చు. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అండగా నిలబడి, తన అపారమైన అనుభవంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడానికి రోహిత్ సిద్ధంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే ఈ మూడు వన్డేల సిరీస్.. రోహిత్ శర్మ తన సామర్థ్యాన్ని మళ్లీ నిరూపించుకోవడానికి ఒక గొప్ప వేదికగా మారనుంది.
Updated on: Oct 18, 2025 | 3:40 PM

టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే భవితవ్యంపై జరుగుతున్న ఊహాగానాలకు బీసీసీఐ (BCCI) గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఆస్ట్రేలియాతో జరగబోయే కీలక వన్డే సిరీస్‌కు ముందు, ఈ ఇద్దరు దిగ్గజాలు 'ఇప్పటికీ జట్టులో ఉండగల ఫిట్‌నెస్, సామర్థ్యం కలిగి ఉన్నారని' బోర్డు స్పష్టం చేసింది. ముఖ్యంగా కెప్టెన్సీ మార్పు తర్వాత రోహిత్ శర్మ గురించి చర్చ మరింత పెరిగిన నేపథ్యంలో, ఈ సందేశం ప్రాధాన్యత సంతరించుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇటీవల బీసీసీఐ ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్‌కు వన్డే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సాధారణ ఆటగాళ్లుగా జట్టులో కొనసాగుతున్నారు. 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన సారథిని అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి తప్పించడంపై పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రోహిత్ శర్మ (38), విరాట్ కోహ్లీ (37)ల వయస్సు, రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా యువకులకు అవకాశమివ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు. అయితే, ఆస్ట్రేలియా సిరీస్‌తో ఈ ఇద్దరు ఆటగాళ్ల వన్డే కెరీర్‌కు తెరపడనుందనే పుకార్లు కూడా బలంగా వినిపించాయి.

ఈ నేపథ్యంలో, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ ఊహాగానాలను కొట్టిపారేశారు. "రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఇదే ఆఖరి వన్డే సిరీస్ అని చెప్పడం పూర్తిగా తప్పు. వారు అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లు. వారిని జట్టులో ఉంచుకుని మేం ఆస్ట్రేలియాను ఓడించగలుగుతాం. వారు ఎప్పుడు రిటైర్ అవ్వాలి అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం" అని ఆయన స్పష్టం చేశారు.

బీసీసీఐ వర్గాల నుంచి అందిన ఈ సందేశం 'హిట్‌మ్యాన్' (రోహిత్ శర్మ) అభిమానులకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ, రోహిత్ శర్మ భారత వన్డే జట్టులో ఇప్పటికీ కీలకమైన ఆటగాడిగా, అత్యంత సామర్థ్యం గల బ్యాట్స్‌మన్‌గా కొనసాగగలడనే స్పష్టమైన సంకేతాన్ని బోర్డు పంపింది.

రోహిత్ శర్మకు ఆస్ట్రేలియాతో మెరుగైన రికార్డు ఉంది. 30 వన్డేల్లో 53.12 సగటుతో 5 సెంచరీలతో సహా 1328 పరుగులు చేశాడు. తాజా సిరీస్‌లో కెప్టెన్సీ భారం లేకపోవడంతో, రోహిత్ తన సహజమైన దూకుడైన ఆటతీరును ప్రదర్శించి, 2027 ప్రపంచకప్ వరకు జట్టులో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.




