Rajeev Rayala |
Updated on: Nov 17, 2021 | 12:24 PM
నగరం నడి బొడ్డున ఉన్న కేబీఆర్ పార్కులో సినీ నటిపై దాడి కలకలం రేపింది. వాకింగ్‌కు వచ్చిన ఆమెను ఓ ఆగంతకుడు విచక్షణారహితంగా కొట్టి, సెల్‌ఫోన్ లాక్కోవడం చర్చనీయాంశమైంది.
కొండాపూర్‌లో ఉండే శాలు చౌరాసియా తెలుగు, తమిళం సినిమాల్లో నటించారు. కేబీఆర్ పార్కుకు ఆనుకుని ఉన్న ట్రాక్‌లో వాకింగ్ చేసేందుకు వచ్చారు. గంటన్నర పాటు వాకింగ్ చేసి ఓ చోట నిలబడ్డారు. ఇంతలో ఓ ఆగంతకుడు వెనుక నుంచి వచ్చి ఆమె పై దాడి చేశాడు.
ఆమె మూతికి గుడ్డ కట్టేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో ఆమె కింద పడింది. దీంతో ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడు.
ఈ కేసులో నిందితుడు- నటి చౌరాసియాతో అసభ్యంగా వ్యవహరించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆమె పెదాలు, మెడపై గాయాలున్నట్టు గుర్తించారు.
చౌరాసియాను అతడు చెట్ల పొదల చాటుకు తీసుకెళ్లే యత్నం చేశాడనీ.. ఈ క్రమంలోనే ఆమె కాలి మడమకు ఫ్రాక్చర్ అయిందనీ.. భావిస్తున్నారు.
దాడి అనంతరం నిందితుడు నాలుగు గంటల పాటు అదే ప్రాంతంలో ఎలా తిరిగాడదన్నది అంతుచిక్కని విషయంగా మారింది.
పలు అనుమానాలకు తావిస్తున్న ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
దాడి ఘటన అనంతరం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొంది కొండాపూర్‌లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. దుండగుడికి సంబంధించిన వివరాలపై ఆమెతో మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.