Vaishnavi chaitanya: బేబీ కథ విన్నప్పుడు నా జీవితమే గుర్తొచ్చింది: వైష్ణవి చైతన్య
బేబీ సినిమాలో నాది ఓ అమాయకురాలైన అమ్మాయి పాత్ర. బస్తీ నుంచి వచ్చిన తర్వాత ఆ యువతి జీవితం ఎలా మారిపోయింది? అనేది ఈసినిమా కథ. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది?
Updated on: Jul 12, 2023 | 12:11 PM

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బేబీ. ఈ సినిమాలో మరో హీరోగా విరాజ్ అశ్విన్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా పరిచయం అవుతుంది. తాజాగా ఆమె మాట్లాడుతూ..

యూట్యూబర్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్‌గా కొందరికి నేను తెలుసు. బేబీ హీరోయిన్ గా నా మొదటి సినిమా. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేష్ గారు నాకు హీరోయిన్‌గా అవకాశాన్ని ఇచ్చారు.

హీరోయిన్ అవ్వాలనే కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ నాకు ఇప్పటికి మంచి అవకాశం వచ్చింది. ఈ పాత్రనుచేయగలనా లేదా అని నా మీద నాకే నమ్మకం లేనిసమయంలో సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు.

నా మీద నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఇన్ స్టాలో రీల్స్ , టిక్ టాక్ లు చేస్తే సినిమా హీరోయిన్ అయిపోతుందా.? అని కూడా అన్నారు. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు కూడా నెగెటివ్ కామెంట్లు చేశారు.ఆ కామెంట్స్ నా పై చాలానే ప్రభావం చూపించింది. నేను యూట్యూబ్ వరకేనా? అని అనిపించింది. కానీ సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నాలో ధైర్యాన్ని నింపారు.

బేబీ సినిమాలో నాది ఓ అమాయకురాలైన అమ్మాయి పాత్ర. బస్తీ నుంచి వచ్చిన తర్వాత ఆ యువతి జీవితం ఎలా మారిపోయింది? అనేది ఈసినిమా కథ. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది? చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. కాలేజ్‌కు వచ్చాక మరో అబ్బాయి లైఫ్‌లోకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించారు.

బేబీ మూవీ మ్యూజిక్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు నా లైఫ్ గుర్తుకు వచ్చింది. రియల్ లైఫ్‌లోంచి తీసుకున్న కథ. నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర. ఇది ఎంతో సున్నితమైన పాత్ర ఇది.

బేబీ సినిమాకు సైన్ చేసి మూడేళ్లు అవుతుంది. చాలా డెప్త్ ఉన్న సీన్లు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడూ ప్రెజర్ అని ఫీల్ అవ్వలేదు. ఇలాంటి పాత్ర వచ్చినందుకు ఎంతో గర్వపడుతుంటాను. నా ప్రాణం పెట్టి ఈ పాత్రను చేశాను. అమ్మాయి కోణంలోంచి ఈ కథ నడుస్తుంటుంది.

షూటింగ్ కోసం సెట్‌లోకి వచ్చినప్పుడు భయపడుతూ ఉండేదాన్ని. కానీ టేక్ చెప్పేసరికి మేం ముగ్గురం చర్చించుకుని రెడీగా ఉండేవాళ్లం. ఆ ఇద్దరూ కూడా ఎంతో ఫ్రీడం ఇచ్చారు. డార్క్ లుక్‌లో ఉన్న సీన్‌లే ఎక్కువ ఎంజాయ్ చేశాను. సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో నెగెటివ్, పాజిటివ్, హీరో, హీరోయిన్లు అని ఉండరు. పరిస్థితులే ప్రభావితం చేస్తాయి.





























