Hero MotoCorp: మే 17 నుంచి హీరో బైకుల ఉత్పత్తి.. మూసివేసిన ప్లాంట్లు దశల వారిగా ప్రారంభం
Hero MotoCorp: హీరో మోటోకార్ప్ మరో రెండు రోజుల్లో తన ఉత్పత్తులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. హర్యానా, ఉత్తరాఖండ్‌కు చెందిన మూడు ప్లాంట్లు ..
Updated on: May 16, 2021 | 6:19 AM

Hero MotoCorp: హీరో మోటోకార్ప్ మరో రెండు రోజుల్లో తన ఉత్పత్తులను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. హర్యానా, ఉత్తరాఖండ్‌కు చెందిన మూడు ప్లాంట్లు మే 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్లాంట్లు లాక్‌డౌన్ నేపథ్యంలో గత నెల 22 నుంచి మూసివేసి ఉన్నాయి.

దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ హీరో మోటో కార్ప్ రేపటి నుంచి ఉత్పత్తులను ప్రారంభించనుంది. అయితే ప్రస్తుతం హర్యానా, ఉత్తరాఖండ్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, హీరో మోటో కార్ప్ ఏప్రిల్ 22 నుంచి మే 2వ తేదీ వరకు అన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని దశలవారీగా నిలిపివేసింది.

ఈ మూడు ప్లాంట్లలో షిప్టు వారిగా పనులు జరుగుతాయని పేర్కొంది. ఇతర ప్లాంట్లలో ఉత్పత్తికి సంబంధించి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇతర ఉత్పాదక కర్మాగారాలు, సౌకర్యాలను క్రమంగా తెరువనున్నారు.

ఇక హర్యానా, ఉత్తరాఖండ్‌తోపాటు హీరో మోటో కార్ప్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, రాజస్థాన్‌లోని నీమ్రానా, గుజరాత్‌లోని హలోల్‌లలో కూడా ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లన్నింటిలో 80 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. 45 ఏండ్ల వయసు పైబడిన ఉద్యోగులలో 90 శాతం కంటే ఎక్కువ మంది టీకాలు వేసినట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది.





























