Amruthakada Plant: కలుపు మొక్కగా భావించే ఈ మొక్క ఆరోగ్యానికి అమృతమే.. అద్భుత ఔషద గుణాలు దీని సొంతం..
ప్రకృతి ఒక ఔషధశాల.. కొన్ని రకాల మొక్కలు, పువ్వులు, కాయలు, పండ్లు, వేర్లు ఇలా ప్రతిదానిలో ఏదోక ఔషధగుణాలున్నాయి. కొన్ని రకాల మొక్కలను మనం చూస్తూ ఉంటాం.. కానీ వాటిని కలుపు మొక్కలని.. ఎందుకూ పనికి రాని పిచ్చి మొక్కలని భావించి పట్టించుకోము. అలా మన ఇంటి చుట్టుపక్కల, పొలం గట్ల మీద కనిపించే మొక్కలలో ఒకటి అమృత కాడ. ఈ మొక్కని నీరి కసువు, వెన్న తీపి కూర, వెన్న వెదురు, అడవి నాభి, యాండ్ర ఆకు అని కూడా అంటారు. కలుపు మొక్క అని పీకేసే ఈ మొక్క నిజంగా ఆరోగ్యానికి అమృతమే అని తెలుసా..
Updated on: Jul 10, 2025 | 5:14 PM

గ్రామాల్లో, పచ్చిక బయళ్లలో, బీడు భూముల్లో, అడవి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే అమృతకాడ మొక్కను చాలా మంది చూసే ఉంటారు. అయితే ఈ మొక్కను కలుపు అంటూ పీకేస్తారు. అయితే అమృత కాడ మొక్కలో అనేక ఔషధ గుణాలున్నాయి. . ఆసియా, ఆఫ్రికా దేశాలలో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మొక్కలో యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలున్నాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడయింది.

ఇంటి పరిసరాలలో, పొలాల గట్ల మీద నీరు నిల్వ ఉండే చోట, చేలల్లో, రోడ్డుకు ఇరువైపులా.. ఇలా ఎక్కడపడితే అక్కడ విరివిరిగా కనిపించే అమృతకాడ మొక్కలో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మొక్క ఆకులను కూరగా చేసుకుని తింటారు. దీనిని తినడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

పశువులు కూడా ఈ మొక్కను ఎంతో ఇష్టంగా తింటాయి. ఈ మొక్కని తినడం వలన పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ మొక్క ఆకులల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. తలనొప్పిని, కుష్టును, కామెర్లను, మలబద్దకాన్ని, మూర్ఛను, జ్వరాన్ని తగ్గించడంలో ఈ అమృతకాడ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.

గాయాలను, పుండ్లను, చర్మ వ్యాధులను, ముఖంపై మొటిమలను నయం చేయడంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి చర్మం పై గాయాలపై రాయడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

స్త్రీలలో వచ్చే సంతాన లేమి సమస్యలను నయం చేయడంలో కూడా అమృతకాడ మొక్క దోహదపడుతుంది. ఈ మొక్క ఆకులను, కాండాన్ని దంచి వాటితో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.

అమృత కాడ ఆకులు జ్వరానికి దివ్య ఔషధంగా పని చేస్తాయి. మలేరియా జ్వరంతో బాధపడుతున్న వారు చల్లని నీటిలో ఈ ఆకులు వేసి ఆ నీటిని వడకట్టుకుని తాగడం జ్వరం తగ్గుతుంది. ఈ మొక్క ఆకుల నీటిలో అర టీ స్పూన్ జీలకర్రను, మిరియాలను వేసి మరిగించి వడకట్టుకుని ఈ నీటిని రోజుకు ఒకసారి తాగినా జ్వరం తగ్గుతుంది.

అమృతకాడ మొక్క వేర్లను జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలు నయం అవుతాయి. నిద్రలేమి, రేచీకటి, కళ్ల కలక వంటి వాటిని తగ్గించడంలో కూడా ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు.

ఈ మొక్కని పేస్ట్ చేసి ఎక్కడైనా నొప్పిగా అనిపించిన చోటఅ అప్లై చేస్తే నొప్పి తగ్గుతుంది. మొలలు కూడా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. గొంతునొప్పి, కుష్టు వ్యాధిని నయం చేయడంతో పాటు నాడీ వ్యవస్థ రుగ్మతలను తగ్గించడంలో అమృతకాడ మొక్క సహాయపడుతుంది.

శరీరంలో వచ్చే నొప్పులను, వాపులను తగ్గించడంలో పాటు చెవి, కర్ణభేరి సమస్యలను నయం చేయడానికి, దంతాల సమస్యలను, పాము కాటుకు విరుగుడుగా కూడా ఈ మొక్కను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




