PRASHANTH KISHORE: కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ జవజీవం.. మూడు కోణాల్లో వ్యూహం రెడీ.. పీకే ప్లాన్ ఆఫ్ యాక్షన్‌పై సర్వత్రా చర్చ
తాజాగా ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైపోయింది. దీన్ని కాంగ్రెస్ సీనియర్ నేత తారిక్ అన్వర్ దాదాపు ధృవీకరించారు. ప్రశాంత్ కిశోర్‌కు పార్టీలో తగిన స్థానం కల్పించేందుకు, ఆయన వ్యూహాలను, సేవలను వినియోగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రెడీ అయిపోయింది.

PRASHANTH KISHORE TO JOIN CONGRESS TRIANGLE POLITICAL STRATEGY SONIA: ప్రశాంత్ కిషోర్.. మరోసారి పొలిటికల్‌గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గాను, టాక్ ఆఫ్ ద టౌన్‌గాను మారాడు. ఈసారి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ప్రశాంత్ కిశోర్ నేరుగా తన రాజకీయ గమనాన్ని మార్చుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత పదేళ్ళుగా రాజకీయ వ్యూహకర్తగా తెరచాటు పాత్రకే పరిమితమై.. పలు పార్టీలను అధికారంలోకి తెచ్చిన ప్రశాంత్ కిశోర్.. ఇపుడు జాతీయ రాజకీయాల్లోకి నేరుగా ఎంట్రీ ఇస్తూ.. తన భవిష్యత్తును కూడా పొలిటికల్ డయాస్పోరాపై చూసుకునేందుకు రెడీ అవుతున్నాడు. మధ్యలో ఆయన నితీశ్ కుమార్ సారథ్యంలోని జెడీయూలో చేరినా అక్కడ పొసగలేదు. దాంతో 2020 జనవరి 29న ప్రశాంత్ కిశోర్‌ను నితీశ్ తన పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత పలు పార్టీలకు వ్యూహకర్తగా పని చేసిన పీకే ఇపుడు రాజకీయాల్లో తన జాతకాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. అందుకోసం ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీని తన వేదికగా ఎంచుకున్నట్లు గత వారం రోజులుగా కథనాలొస్తున్నాయి. తాజాగా ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైపోయింది. దీన్ని కాంగ్రెస్ సీనియర్ నేత తారిక్ అన్వర్ దాదాపు ధృవీకరించారు. ప్రశాంత్ కిశోర్‌కు పార్టీలో తగిన స్థానం కల్పించేందుకు, ఆయన వ్యూహాలను, సేవలను వినియోగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రెడీ అయిపోయింది. తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ కిశోర్‌కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీని సంస్థాగతంగా పూర్తిగా మార్చి వేసే ఉద్దేశంతో సోనియా గాంధీ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు సోనియా గాంధీ.. ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోవాలని గత ఏడాదిగా ప్రయత్నిస్తూనే వున్నారు. మొత్తానికిపుడు ప్రశాంత్ కిశోర్ చేరికకు రంగం సిద్దమైంది. ఇదే జరిగితే సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ళ ముందే కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది అనుకోవచ్చు. ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధిష్టానానికిచ్చిన ఆ అద్భుతమైన యాక్షన్ ప్లాన్ ఏంటి ? ఇదిప్పుడు ఆసక్తి రేపుతోంది.
సోనియా గాంధీకి అందజేసిన యాక్షన్ ప్లాన్ డ్రాఫ్ట్ ప్రకారం ప్రశాంత్ కిశోర్ మూడు కోణాలను స్పృశించినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి CONGRESS PARTY ని ముందుగా సంస్థాగతంగా మార్చివేయడం. కేవలం గాంధీ (నిజానికి నెహ్రూ లెగసీ) కుటుంబానికి చెందిన వారి పెత్తనమే పార్టీలో చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయాన్ని మార్చాల్సిన అవసరం వుందన్నది ప్రశాంత్ కిశోర్ సూచనగా తెలుస్తోంది. పార్టీని సంస్థాగతంగా మార్చడంలోను పీకే రెండు వేర్వేరు విధానాలను ప్రతిపాదించాడు. అందులో ఒకటి.. సోనియాగాంధీ యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలయెన్స్ (యూపీఏ) ఛైర్‌పర్సన్ కొనసాగడం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా గాంధీ కుటుంబేతర వ్యక్తిని నియమించడం. యుపీఏ లేదా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు నాయకునిగా రాహుల్‌గాంధీ, కో-ఆర్డినేషన్ జనరల్ సెక్రటరీగా ప్రియాంకాగాంధీని నియమించడం ద్వారా భవిష్యత్తు ప్రణాళికను పక్కాగా అమలు చేయడం ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనలో మొదటి అంశం. ఇలా చేయడం అంటే రాహుల్ గాంధీని పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా చేయడం వల్ల చట్టసభలో మోదీ వర్సెస్ రాహుల్ గాంధీగా పరిస్థితి మారుతుందనేది పీకే అంచనా. దీనివల్ల ప్రజల గొంతును పార్లమెంటు లోపల, బయట బలంగా వినిపించడానికి వీలవుతుందని ఆయన వ్యూహం. ఇక మీదట పార్టీలో వన్ పర్సన్ వన్ పోస్టు అన్న సిద్ధాంతాన్ని అనుసరించాలని కూడా ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించి పార్టీ అనుబంధ సంస్థలను ప్రక్షాళన చేయాలని పీకే ప్రతిపాదించారు. కాగా ఇదే ప్రతిపాదనను కొద్దిగా మార్చి మరో ప్రపోజల్ కూడా పీకే సోనియా ముందుంచారు. యూపీఏ ఛైర్‌పర్సన్‌గా పాతతరం కాంగ్రెస్ నాయకుడిని పెట్టి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగడం. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గాంధీయేతర కుటుంబ సభ్యుడిని నియమించడం. పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్‌గాంధీని ఎన్నుకోవడం. కోఆర్డినేషన్ జనరల్ సెక్రటరీగా ప్రియాంకా గాంధీని నియమించడం. ఇలా మరో ప్రతిపాదనను కూడా పీకే కాంగ్రెస్ పెద్దల ముందుంచారు. అయితే వీటిలో దేనని సోనియా గాంధీ ఓకే చేస్తారనేది వేచి చూడాల్సి వుంది.
ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కూడా ప్రశాంత్ కిశోర్ ఓ డ్రాఫ్టును సోనియాకిచ్చారు. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్ళాల్సి వుంటుంది. ఒకటి 17 రాష్ట్రాలలో సొంతంగా.. ఒంటరిగా 358 లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి. ఇలా చేస్తేనే పార్టీ పునర్వైభవాన్ని సాధిస్తుందనేది ప్రశాంత్ కిశోర్ వాదన. అదేసమయంలో పలు రాష్ట్రాలలో బీజేపీని నేరుగా ఎదుర్కొంటున్న పార్టీలతో జతకట్టాలనేది పీకే వ్యూహంగా వుంది. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేనలతోను, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తోను, జార్ఖండ్‌లో జేఎంఎంతోను, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీతోను, తమిళనాడులో డీఎంకేతోను, జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్సుతోను కాంగ్రెస్ జతకట్టాలని ఆయన సూచించారు. ఆయన ప్రతిపాదించిన పార్టీలలో ఒక్క నేషనల్ కాన్ఫరెన్సు మినహా మిగిలినవి ఆయా రాష్ట్రాలలో అధికారంలో వున్న పార్టీలే కావడం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీతో జట్టు కట్టాలని సూచించారు. ఈ మేరకు పీకే కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీడియా ముందుకు వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడి భాగస్వామ్య పక్షాలతో కలిసి వెళ్లాలని ప్రతిపాదించారు. ఈ పార్టీలన్నీ 2019 ఎన్నికల్లో 128 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 249 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచినట్లు ప్రశాంత్ కిశోర్ తన ప్రజెంటేషన్‌లో ప్రతిపాదించారు. మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన సీట్లన్నీ కలిపితే 377 అవుతాయని, వచ్చే ఎన్నికల్లో వీటిపై దృష్టి సారిస్తే భారీగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. బీజేపీతో ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీచేసి, మిగిలిన చోట్ల 5-6 పార్టీలతో వ్యూహాత్మక పొత్తులు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు గణనీయంగా మెరుగవుతాయని తన పీపీటీలో వివరించారు పీకే.
ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సీడబ్ల్యూసీ సభ్యుడు తారిక్ అన్వర్ మాటల్లో ఇది స్పష్టమైంది. వ్యూహకర్తగా కొనసాగబోనని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రశాంత్ కిశోర్ స్వయంగా చెప్పినందున ఆయన పార్టీలో చేరడమే కరెక్టని తారిక్ అన్వర్ అన్నారు. అయితే.. కొందరు కాంగ్రెస్ నేతలు ప్రశాంత్ కిశోర్ రాకను వ్యతిరేకిస్తున్నట్లు కూడా కథనాలున్నాయి. వాటిని తారిక్ అన్వర్ కొట్టిపారేశారు. పార్టీలో సోనియా నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే వున్నా.. ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించిన విధంగా పొలిటికల్ పొత్తులు సాధ్యమేనా అన్న చర్చ కూడా అప్పుడే మొదలైంది. ఉదాహరణకు ఏపీలో వైసీపీ.. కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు సిద్దపడుతుందా అన్నది అనుమానమే. ఎందుకంటే తనకు పదేళ్ళ ముందే రావాల్సిన సీఎం పదవిని సోనియానే దూరం చేసిందని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికీ నమ్ముతున్నారు. ఆమె పట్ల గుర్రుగానే వున్నారు. అదేసమయంలో గత ఎన్నికల్లో తన చిరకాల ప్రత్యర్థి చంద్రబాబుతో రాహుల్ చట్టపట్టాలేసుకుని మరీ ప్రచారం చేశారు. అదేసమయంలో ఏపీలో ఉనికినే కోల్పోయిన కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం వల్ల వైసీపీకి అదనంగా ఒరిగేదేమీ లేదు. పైగా రాష్ట్రాన్ని విభజించిందన్న కారణంగా ఏపీ ప్రజలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల కోపంతోనే వున్నారు. పొత్తంటే ఇరువురికి ప్రయోజనకరంగా వుండాలి. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీకి లాభించే పొత్తుకు తామెందుకు సిద్దపడాలన్న అభిప్రాయంతో చాలా మంది వైసీపీ నేతలున్నారు. సో.. ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించినట్లు ఏపీలో వైసీపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు చాలా కాలంగా మిత్రపక్షాలే. కానీ రెండేళ్ళ క్రితం మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అధికారం కోసం శివసేన చిరకాల వైరి పక్షాలైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు దగ్గరైంది. అయితే అది బీజేపీని నిలువరించే క్రమంలో ఎన్నికల తర్వాత జరిగింది. వచ్చే ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్ పార్టీలు నేరుగా పొత్తుతో బరిలోకి దిగితే హిందుత్వ నినాదం ప్రబలమయ్యే అవకాశాలున్నాయి. దాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలచుకుంటే శివసేన కట్టర్ హిందూ స్టాంప్‌కు దూరం కాక తప్పదు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు థాక్రే కుటుంబ మరో వారసుడు రాజ్ థాక్రే రెడీగా వున్నారు. ఇటీవల అజాన్, హనుమాన్ చాలీసా వివాదంతో ఆయన మహారాష్ట్రలో పాపులర్ అయ్యారు కూడా. ఇలా పీకే ప్రతిపాదించిన వాటిలో కొన్ని ఆచరణ సాధ్యంగా వుంటే మరికొన్ని వాస్తవ దూరాలుగాను, ఆచరణలో సంక్లిష్టంగానూ కనిపిస్తున్నాయి.




