AP Politics: ఏపీలో వేడెక్కిన రాజకీయం.. కూటమి కూర్పుపై జోరుగా చర్చలు.. డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఉన్నట్లుండి వేడెక్కాయి. అందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. టిడిపితో పవన్ కళ్యాణ్ జతకడతారా? లేక బిజెపిని ఒప్పించి మూడు పార్టీల కూటమి కూర్పులో కీలక భూమిక వహిస్తారా ?

AP Politics: ఏపీలో వేడెక్కిన రాజకీయం.. కూటమి కూర్పుపై జోరుగా చర్చలు.. డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీ
Ravi
Follow us
Rajesh Sharma

|

Updated on: May 12, 2023 | 8:41 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఉన్నట్లుండి వేడెక్కాయి. అందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి.. అకాల వర్షాలతో దిగాలు పడుతున్న రైతులను పరామర్శించే పేరిట రెండు ప్రధాన విపక్షాలు తెలుగుదేశం, జనసేన పార్టీలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించడం. రెండో కారణం.. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చన్న సంకేతం. రెండింటిలో ఏది కారణమైనా పెద్దగా తేడా లేదు. కానీ, వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దుచేసి తెలంగాణ సహా జరగనున్న ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే తాను ఎన్నికలకు వెళ్ళనున్నారు అన్న వార్త మాత్రం విపక్షాలను ఒక్కసారి యాక్టివ్ గా చేసింది అని చెప్పవచ్చు. నిజానికి గత కొంతకాలంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వ్యూహాలను అంచనా వేస్తూ తమ తమ రాజకీయ వ్యూహాలకు విపక్షాలు పదును పెడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తూనే వీలైనంత ఎక్కువగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇంకోవైపు తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జిల్లాల పర్యటనలను వేగవంతం చేశారు. ఇంకోవైపు జనవరి చివరి వారంలో మొదలుపెట్టిన పాదయాత్రతో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనాలతో మమేకం అవుతున్నారు. ఇటీవల జరిగిన మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టిడిపి, జనసేన పార్టీలలో ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని రెండు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. జనసేన, టీడీపీ కలిస్తే వైయస్సార్సీపీని అధికారం నుంచి తప్పించవచ్చని ఇరుపార్టీల నేతలు భావిస్తున్నారు. కానీ వచ్చిన చిక్కల్లా జనసేన పార్టీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో దోస్తీ నెరపడమే. ఆ దోస్తీని తెగదెంపు చేసుకుని టిడిపితో పవన్ కళ్యాణ్ జతకడతారా? లేక బిజెపిని ఒప్పించి మూడు పార్టీల కూటమి కూర్పులో కీలక భూమిక వహిస్తారా అన్నది కీలకంగా మారింది.

ఏమో గుర్రం ఎగరా వచ్చు!

అకాల వర్షాల కారణంగా పంటలను కోల్పోయి.. దిగాలు పడుతున్న కోస్తా ప్రాంత రైతాంగాన్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటించిన మర్నాడు చంద్రబాబు కూడా ఆ ప్రాంత పర్యటనకు వెళ్లారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలలో ఈ మధ్య మూడు పార్టీలు కలిస్తే జగన్‌ని గద్దె దింపడం సులభతరం అవుతుందని చెబుతూ వస్తున్నారు. కానీ అదే జరుగుతుంది అని ఆయన కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసేందుకు బిజెపి అధిష్టానానికి రిజర్వేషన్స్ ఉన్నాయన్న సంగతి జగమెరిగిన సత్యం. దానికి కారణం కూడా అందరికీ విధితమే. 2019 నాటి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన చంద్రబాబు.. బిజెపి నేతలను మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఒక దశలో చంద్రబాబు మాటలు హద్దు మీరాయి కూడా. అలాంటి చంద్రబాబుతో కలిసి పనిచేసేందుకు ఇటు ఏపీ బీజేపీ నేతలకు, అటు పార్టీ అధినేతలకు ఇష్టం లేదనేది ప్రస్తుతానికి అందరి అభిప్రాయం. కానీ, రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు. గుర్రం ఎగిరినట్టు బిజెపి మెత్తబడి టిడిపి, జనసేన కూటమితో కలిసి ఏపీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనవచ్చు. కానీ టిడిపితో కలిసేంత వైరం బిజెపికి వైసీపీతో లేదు. ఇంకా చెప్పాలంటే బిజెపి నేతల సూచన మేరకే జగన్ ముందస్తు ఆలోచన చేస్తూ ఉండవచ్చు కూడా. ఎందుకంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెద్దగా ఆశలు లేవు. అక్కడ వైసీపీ తరపున గెలిచే ఎంపీలు కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి అన్ని రకాలా మద్దతు పలుకుతూనే వున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఉభయ కుశలోపరి వైసీపీ, బీజేపీలకు ప్రయోజనాలుంటాయి. జగన్ ముందస్తుకు వెళితే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి ఒకసారి, పార్లమెంటుకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటు ఎన్నికలు సెపరేటుగా జరిగితే పూర్తిగా మోదీ చరిస్మా పనిచేస్తే.. కనీసం రెండు, మూడు ఎంపీ సీట్లు అయినా గెలుచుకోవచ్చని కమలనాథులు భావిస్తూ ఉండవచ్చు. అందుకే ముందస్తు యోచన పరిశీలించమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బిజెపి అధిష్టానం సూచించినట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా బిజెపి కోణంలో కీలకం. ఏపీ, తెలంగాణ అసెంబ్లీలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు కలిగిన వారు ఖచ్చితంగా తమ సొంత ఏరియాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతారు. ఆ లెక్కన హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలో ఉన్న ఆంధ్ర ప్రాంత వాసులు ఇక్కడ ఓటు వేయకుండా తమ సొంత ప్రాంతానికి వెళ్లి ఓటు వేయడం వల్ల టిఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత నష్టం కలిగించవచ్చని బిజెపి నేతలు వ్యూహరచన చేస్తూ ఉండవచ్చు.

కూటమి కూర్పు బాధ్యత తనదేనా?

ఒక దినపత్రికలో జగన్ ముందస్తు ఆలోచన చేస్తున్నారన్న వార్త రావడంతో టిడిపి, జనసేన అప్రమత్తమయ్యాయి. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా వచ్చే నెల నుంచి ఏపీలో క్షేత్రస్థాయిలో మరింతగా పర్యటిస్తామని ప్రకటించారు. ‘‘ సేఫ్ ఆంధ్ర ప్రదేశ్ నా కండిషన్ దానికోసం వైసిపిని గద్దెదింపడం అనివార్యం’’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం విశేషం. అదే సమయంలో తన పార్టీ ఒక్కటే రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ దక్కించుకోలేదని చెబుతూ కూటమి అవసరాన్ని నొక్కి చెప్పారు పవన్ కళ్యాణ్. ఒకవైపు జగన్ 175 సీట్లకు 175 సీట్లు గెలిచే లక్ష్యంతో పనిచేస్తున్నానని చెబుతుంటే.. పవన్ కళ్యాణ్ కేవలం 35 నుంచి 40 సీట్లు వస్తే చాలని తానే కింగ్ మేకర్‌నని ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే ప్రకటించేశారు. ఈ లెక్కన ఆలోచిస్తే ఏపీలో వైసిపి తర్వాత టిడిపినే బలమైన పార్టీ అని జనసేన అని పరోక్షంగా అంగీకరించినట్లయ్యింది. ప్రభుత్వ ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ గత ఏడాదిన్నర కాలంగా చెబుతూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో కూటమి కూర్పు కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది.

కూటముల ప్రభావం ఉభయ రాష్ట్రాల్లో!

ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. బిజెపిని కూటమి వైపు తీసుకువచ్చే బాధ్యతలను పవన్ కళ్యాణ్‌కు అప్పగించి.. తాను క్షేత్రస్థాయి పర్యటనలను ఎంచుకోవడం వ్యూహాత్మకమని అర్థమవుతుంది. ఒకవైపు నారా లోకేష్ పాదయాత్ర.. ఇంకోవైపు పరామర్శల పేరిట చంద్రబాబు గ్రౌండ్ లెవెల్ పర్యటనలు.. మరోవైపు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం లాంటి చర్యలు తెలుగుదేశం పార్టీలో కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ నెంబర్ పెంచుకోవాలని చూస్తున్న చంద్రబాబు మంచి ఆర్థిక పరిపుష్టి కలిగిన కాసాని జ్ఞానేశ్వర్‌ను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. ఆయన సారథ్యంలో ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో టిడిపి తరఫున బలమైన అభ్యర్థులను నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీకి ముందు నుంచి అండగా నిలుస్తున్న సామాజిక వర్గాన్ని ఏకం చేసే ప్రయత్నాలు అంతర్లీనంగా చంద్రబాబు కొనసాగిస్తున్నారు. టిడిపి నుంచి ఇతర పార్టీలలోకి వెళ్లిన నేతలను తిరిగి రప్పించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ పంచన చేరిన మాజీ టిడిపి నేతలు బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే సంకేతాలు లేకపోతే టిడిపి వైపు చూసే అవకాశం ఉంది. దీనికి ఏపీలో ఏర్పడే మూడు పార్టీల కూటమికి ఇంటర్ లింక్ ఉందని మనం విశ్లేషించుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో టీడీపీ-బీజేపీ పొత్తు ఉంటే తెలంగాణలోనూ దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అప్పుడు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో టిడిపి భాగస్వామి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదంతా మోదీ మూడోసారి విజయం సాధించే అవకాశాలుంటేనే సుమా.  ఏతా వాతా ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయం ఇప్పుడు రాజకీయ పొత్తుల మీద.. ఏర్పడబోయే కూటములమీద ఆధారపడి ఉన్నాయని విశ్లేషించుకోవచ్చు.