పురాణాలలో మనం చాలా కథలను విన్నాం. అందులో శాపం కారణంగా మానవులు రాయిగా మారిపోవడం లేదంటే చెట్లలా మారిపోవడం జరుగుతుంటుంది. కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఓ ఐదు నెలల పసికందు రోజు రోజుకు రాయిగా మారిపోతుంది. కానీ ఇది ఎవరో పెట్టిన శాపం వల్ల కాదు అరుదైన వ్యాధి వల్ల జరుగుతుంది. దీనివల్ల పసికందు కండరాలు ఎముకలుగా మారుతున్నాయి. లెక్సీ రాబిన్స్ అనే ఈ ఆడపిల్ల 31 జనవరి 2021 న జన్మించింది. ఆమె సాధారణ పిల్లవాడిలా కనిపించింది కానీ పుట్టాక ఆమె బొటనవేలును కూడా కదల్చలేదు.
వెంటనే ఆమె తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. కాని లెక్సీ వ్యాధి నిర్ధారణకు కొంత సమయం పట్టింది. ఆమెకు ఫైబ్రోడిస్ప్లాసియా ఓసిఫికన్స్ ప్రోగ్రెసివా (ఎఫ్ఓపి) అనే తీవ్రమైన సమస్య ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఇది రెండు మిలియన్ల జనాభాలో ఒకరికి మాత్రమే సంభవిస్తుందని వివరించారు. FOP కారణంగా రోగి అస్థిపంజరం బయట కూడా ఎముక ఏర్పడటం ప్రారంభమవుతుంది. శరీర కదలిక ఆగిపోతుంది. ఈ వ్యాధి కండరాలు, కణజాలాలను ఎముకగా మారుస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా ఈ పరిస్థితి శరీరాన్ని రాయిగా మారుస్తుంది. ఈ వ్యాధికి చికిత్స కూడా లేదు. ఇందులో రోగులు 20 సంవత్సరాల వయస్సు వరకు పూర్తిగా మంచం మీదే ఉంటారు. సుమారు 40 సంవత్సరాలు బతికుండే అవకాశాలు ఉన్నాయి.
ఈ వ్యాధి కారణంగా లెక్సీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆమెకు ఇంజెక్షన్లు, టీకాలు, దంత సంరక్షణ చేయలేరు. అంతేకాదు ఆమె బిడ్డకు జన్మనివ్వదు. లెక్సీ తల్లి అలెక్స్ మాట్లాడుతూ ఎక్స్-రే తరువాత ఆమెకు మొదట సిండ్రోమ్ ఉందని నడవలేమని డాక్టర్లు చెప్పారు. కానీ ఈ వ్యాధి ఉందని తేలేసరికి నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి నివారణ కనుగొనటానికి ఛారిటీ ఫండ్ కోసం కృషి చేస్తున్నారు. అదనంగా అలెక్స్, డేవ్ కొంతమంది నిపుణులతో మాట్లాడారు. ఈ కేసులో కొన్ని పరీక్షలు జరిగాయని ఇది కొంతవరకు విజయవంతమైందని తెలిపారు. లెక్సీ తల్లిదండ్రులు FOP కోసం పరిశోధన, నివారణ కోసం ఫండ్ రేసును ప్రారంభించారు.