AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిడింబి మాతకు ఓ ఆలయం, ఏటా అక్కడ బ్రహ్మండమైన దూంగ్రీ మేళా, కరోనా కారణంగా ఆగిన వేడుక!

Hidimba mata temple:  కరోనా వైరస్‌ మహా వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో పండగలేమిటండి..? అది కూడా మండుటెండల్లో..

హిడింబి మాతకు ఓ ఆలయం, ఏటా అక్కడ బ్రహ్మండమైన దూంగ్రీ మేళా, కరోనా కారణంగా ఆగిన వేడుక!
Himba Mata Temple
Balu
| Edited By: Ravi Kiran|

Updated on: May 14, 2021 | 10:14 AM

Share

Hidimba mata temple:  కరోనా వైరస్‌ మహా వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో పండగలేమిటండి..? అది కూడా మండుటెండల్లో అంటారేమో! అసలు కరోనా అన్నది లేకపోయి ఉంటే.. హిమాచల్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ విధించకపోయి ఉంటే అక్కడ ఇప్పుడు బ్రహ్మాండమైన వేడుక జరిగేది.. ఏం చేస్తాం..? ముదనష్టపు కరోనా మనకు ఆనందాలు, అనుభూతులు లేకుండా చేస్తోంది. నిద్రలేచిన దగ్గర్నుంచి పడుకునేవరకు ఏం జరుగుతుందా అన్న టెన్షనే ఉన్నప్పుడు ఉత్సవాల గురించి ఆలోచన, ఉత్సాహమూ ఎలా ఉంటాయి? అంతా బాగుంటే మనాలిలోని హిడంబామాత ఆలయంలో పెద్ద ఉత్సవం జరిగేది.. ఈ ఏడాది ఉత్సవం జరగకపోయినా పూజలు పునస్కారాలు మాత్రం ఉంటాయి. హిడింబి. భీమసేనుడి భార్య. ఘటోత్కచుడి మాతృమూర్తి. మాయాబజార్‌ సినిమా చూస్తే హిడింబి ఎంత సౌమ్యురాలో, ఎంత ఉత్తమురాలో అర్థమవుతుంది. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి ప్రాంతవాసులు హిడింబిని దైవంగా భావిస్తారు. హిడంబామాతగా భక్తితో కొలుచుకుంటారు. ఆమె జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు దూంగ్రీమేళాను నిర్వహిస్తారు. కరోనా లేకపోయి ఉంటే ఈ రోజు నుంచి 16 వరకు ఈ ఉత్సవాలు జరిగేవి.

అమృతం తాగిన వాళ్లు కాదు దేవతలంటే, అమృతంలాంటి మనసున్నవారే దేవతలు. అలాంటివారికి గుళ్లు గోపురాలు కట్టి పూజలు పునస్కారాలు చేయడం, వేడుకలు సంబరాలు చేసుకోవడం మనుషులన్నవారు ఎవరైనా చేస్తారు.. అందుకే అక్కడక్కడ రాక్షసజాతిలో పుట్టినవాళ్లకీ ఆలయాలు నిర్మిస్తున్నారు. భక్తితో స్మరిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో భీమసేనుడి భార్య హిడింబి కూడా పూజలందుకుంటోంది. హిడింబాదేవిగా స్థానికులు భక్తితో కొలుచుకునే హిడింబికి ఓ అద్భుతమైన ఆలయం కూడా ఉంది. ఇప్పుడీ ఆలయ ప్రస్తావన ఎందుకంటే వసంతరుతువు చివరలో ఇక్కడో వేడుక జరుగుతుంది. ఈసారి మనకా వేడుక చూసే అదృష్టం లేదు.. అసలు వేడుక కంటే జాతర అంటే బాగుంటుదేమో! హిడంబామాత మీద తమకున్న భక్తి ప్రపత్తులను స్థానికులు చాటుకునే ఉత్సవం. ప్రతి ఏడాది మే 14 నుంచి 16 వరకు జరిగే ఉత్సవాన్ని దూంగ్రీ మేళ అంటారు. మూడు రోజుల పాటు వైభవంగా కన్నుల పండుగగా ఈ మేళ జరుగుతుంది.

పురాణ ఇతిహాసాల మీద ఆసక్తి ఉన్నవారికి తప్పితే హిడింబి గురించి ఇవాళ్టి తరానికి పెద్దగా తెలిసుండకపోచ్చు.. మాయాబజార్‌ సినిమాను చూసిన వాళ్లకు మాత్రం హిడింబి గురించి తెలిసే ఉంటుంది.. మహాభారతంలో ఆమెది విశిష్టపాత్ర. హిడింబి… హిడింబాసురుడనే రాక్షసుడి చెల్లెలు. పాండవుల్లో రెండోవాడైన భీముడి భార్య.. ఘటోత్కచుడి మాతృమూర్తి. భీముడితో జరిగిన యుద్ధంతో హిడింబాసురుడు మరణిస్తాడు. అంతకు ముందే భీముడిపై మనసుపారేసుకుంటుంది హిడింబి. భీముడితో వివాహం జరిపించమని కుంతిదేవిని వేడుకుంటుంది. కుంతి అంగీకారంతో భీముడు, హిడింబిలు పెళ్లి చేసుకుంటారు. ఏడాది పాటు అక్కడే ఉంటారు పాండవులు. భీముడు-హిడింబిలకు ఘటోత్కచుడనే కుమారుడు జన్మిస్తాడు.. ఘటోత్కచుడు పెరిగి పెద్దవాడై రాజ్యపాలనాభారాన్ని తీసుకున్న తర్వాత హిడింబి హిమాలయాలకు వెళ్లిపోయింది. అక్కడ తపస్సు చేసింది. అనేక దివ్యశక్తులను పొందింది. కోరికలు తీర్చే దేవత అయ్యింది. ఇప్పుడు అశేష భక్తుల పూజలందుకుంటోంది..

ఈ ఆలయ నిర్మాణకర్త మహారాజా బహదూర్‌సింగ్‌. 1553లో హిడించా పేరుతో పగోడా తరహాలో ఈ అద్భుత ఆలయాన్ని నిర్మించాడు. దట్టమైన దేవదారు వృక్షాల మధ్య ఉన్న ఈ ఆలయంలో ఎప్పుడూ ఓ అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది.. తమకు ఎలాంటి సమస్య ఎదురైనా ఎలాంటి ఆపద సంభవించినా ప్రజలు హిడింబామాతను వేడుకుంటారు…నిండుమనసుతో పూజలు చేస్తారు. ఆమె దీవెనలు అందుకుంటారు. ఏడాదిలో కొన్ని రోజులు మినహా మిగిలిన కాలమంతా హిడింబి ఆలయంలో మంచుపేరుకుని ఉంటుంది.. మొత్తం చెక్కతో నిర్మించిన ఈ ఆలయానికి నాలుగు అంతస్తులున్నాయి. చతురస్ర్త ఆకారంలో ఉన్న నాలుగు అంతస్తుల్లో మూడు చెక్కతో కట్టినవే! గచ్చు కూడా చెక్కతో చేసిందే! ఒక నాలుగో రూఫ్‌ను మాత్రం ఇత్తడితో కవర్‌ చేశారు. ఈ శిఖరం ఎత్తు 24 మీటర్లు ఉంటుంది. గుడి ద్వారాలు కూడా చక్కగా చెక్కిన నగిషీలతో అందంగా ఉంటాయి. గర్భగుడిలో హిడింబామాత విగ్రహం కేవలం మూడు అంగుళాలే ఉంటుంది. ఈ గుడికి 70 మీటర్ల దూరంలో మరో ఆలయం ఉంది.. అది ఘటోత్కచుడి ఆలయం. హిడింబి ఆలయంలోపల ఓ పెద్దరాయి మీద ఆమె పాదముద్ర కూడా ఉంది..ఇప్పుడీ ఆలయంలో దుంగ్రీ మేళా జరుగుతోంది. అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవాల కోసమే పర్యాటకులు ఎదురుచూస్తూ ఉంటారు..

కులు రాజులకు దేవి హిడింబి కులదైవం.. ఆ దేవత అనుమతితోనే అన్ని పనులు చేసేవారు.. భక్తితో కొలుచుకున్న తర్వాత ఆ మాతకు దున్నలను బలి ఇచ్చేవారు. హిడింబి జన్మదినాన్ని పురస్కరించుకునే దూంగ్రీ మేళాను నిర్వహిస్తారు. యువతులు సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. తమ సంప్రదాయ నృత్యం కుల్లు నట్టితో మేళాను వర్ణమయం చేస్తారు. హిడింబాదేవి అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తారు. యువకులు బియ్యంతో చేసిన బీరును సేవిస్తారు. వసంతరుతువులో జరిగే ఉత్సవం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి హిడింబాదేవిని పూజిస్తారు. దుంగ్రీ మేళా సందర్భంగా స్థానిక ఆలయాల నుంచి ఉత్సవమూర్తులను ఇక్కడికి తరలిస్తారు. సిమ్సా నుంచి కత్రిక్‌స్వామి. పార్షా నుంచి చండాల్‌ రుషి. అలయో నుంచి శ్రిష్టి నారాయణ్‌. జగత్‌సుఖ్‌ నుంచి శ్రీగన్హ్‌. షాజ్లా నుంచి విష్ణు. సియల్‌ నుంచి మహాదేవి. నసోగి నుంచి నారాయణ్‌ దేవతామూర్తులు దుంగ్రీ మేళాకు అతిథులుగా వస్తాయి. ఉత్సవాలు పూర్తయ్యాక మేళా మనాలి గ్రామంలోని మను ఆలయానికి తరలివెళుతుంది..