సాగు చట్టాలపై ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ కీలక వ్యాఖ్యలు.. ఆదాయం పెరుగుతుంది కానీ..
Geetha Gopinath Coments: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలపై ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ కీలక

Geetha Gopinath Coments: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలపై ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టాల వల్ల రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని కానీ వీటి వల్ల ప్రభావితమయ్యే రైతులకు సామాజిక రక్షణలు కల్పించాలని సూచించారు. కొత్త చట్టాలు ప్రధానంగా మార్కెటింగ్ ఆధారంగా రూపొందించారని, వీటి వల్ల కొత్త మార్కెట్లలో ఉన్న అవకాశాల్ని ఒడిసిపట్టుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు.
మండీలతో పాటు ఇతర కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎలాంటి పన్ను చెల్లించే అవసరం లేకుండా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం చట్టాలు కల్పిస్తున్నాయన్నారు. దీనివల్ల అన్నదాతల ఆదాయం తప్పకుండా పెరుగుతుందన్నారు. అయితే, కొత్త సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. వాటివల్ల ప్రభావితమయ్యే వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై రైతు సంఘాలు, కేంద్రం మధ్య 11 విడతలుగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయినా ఎలాంటి ఫలితం తేలలేదు. ఈ క్రమంలో రెండు సంవత్సరాల వరకు చట్టాల అమలును నిలిపివేస్తామని ఈలోగా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని కేంద్రం ప్రతిపాదించింది. కానీ రైతులు మాత్రం చట్టాల రద్దునే కోరుతున్నారు.