West Bengal: అటు మహారాష్ట్ర.. ఇటు పశ్చిమ బెంగాల్‌లో ఉగ్ర కలకలం.. ఇద్దరు అల్‌ఖైదా సభ్యల అరెస్టు

ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో (AQIS) లో అల్ ఖైదాకు చెందిన ఇద్దరు అనుమానిత సభ్యులను అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

West Bengal: అటు మహారాష్ట్ర.. ఇటు పశ్చిమ బెంగాల్‌లో ఉగ్ర కలకలం.. ఇద్దరు అల్‌ఖైదా సభ్యల అరెస్టు
Al Qaeda Terrorists

Updated on: Aug 18, 2022 | 4:33 PM

Al-Qaeda Terrorists Arrest: మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసిన ఉగ్ర లింకులతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా హరిహరేశ్వర్ బీచ్‌లో మూడు ఏకే-47 ఆయుధాలు, బుల్లెట్లతో కూడిన పడవ కనిపించడంతో మంగళవారం హైఅలర్ట్ ప్రకటించారు. ఈ తరుణంలోనే పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) యూనిట్ బుధవారం ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో (AQIS) లో అల్ ఖైదాకు చెందిన ఇద్దరు అనుమానిత సభ్యులను అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

నార్త్ 24 పరగణాస్‌లోని షాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరీబారి వద్ద బుధవారం రాత్రి ఎస్‌టిఎఫ్ అధికారులు దాడి చేసి ఉగ్రవాద సంస్థతో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలతో ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారిలో ఒకరు దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లాలోని గంగారాంపూర్ నివాసి కాగా.. మరొకరు హుగ్లీ జిల్లాలోని ఆరంబాగ్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. దాడిలో వారి వద్ద నుండి అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

వీరిద్దరూ ఉగ్రవాద సంస్థతో ప్రమేయం ఉన్నారని.. భారత్‌పై యుద్ధం చేస్తున్నట్టు సూచించే రాడికలైజ్డ్ ఆలోచనలతో కూడిన పత్రాలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరినీ విచారించిన తరువాత AQISకి చెందిన కనీసం 17 మంది ఇతర సభ్యులు ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆ 17 మంది ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు. గంటల వ్యవధిలోనే బెంగాల్, మహారాష్ట్రలలో ఉగ్రవాద లింకులు వెలుగుచూడటంతో హై అలర్ట్ ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..