వింత వ్యాధితో బాధపడుతున్న బాలుడికి అండగా అనంత్ అంబానీ.. ఏకంగా విమానం పంపించి..
ఒళ్లంతా మంటలు.. నీళ్లలో ఉంటేనే రిలీఫ్.. కంటికి కనిపించని వింత వ్యాధితో చెరువునే ఇల్లుగా మార్చుకున్న ఓ పశ్చిమ బెంగాల్ బాలుడి దీనగాథ ఇప్పుడు యావత్ దేశాన్ని కదిలిస్తోంది. ఈ విషయం తెలసుకున్న అనంత్ అంబానీ అతడికి అండగా నిలిచారు. మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడిని ప్రత్యేక విమానంలో ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేయించారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ బాలుడి వింత పరిస్థితి యావత్ దేశాన్ని కదిలించింది. ఒళ్లంతా తీవ్రమైన మంట పుడుతుండటంతో రాత్రీ పగలూ చెరువు నీటిలోనే గడుపుతున్న ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగా గ్రామానికి చెందిన ఇక్బాల్ అనే టీనేజర్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ అండగా నిలిచారు. బాలుడిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు. ఇక్బాల్ చెరువు నీటిలోనే ఉంటూ అల్పాహారం తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీటిలో నుంచి బయటకు వస్తే శరీరం అంతా విపరీతమైన మంటతో దహించుకుపోతున్న భావన కలుగుతుందని బాలుడు తెలిపాడు. దీనికితోడు ఏదో అదృశ్య శక్తి తనను ఆవహించినట్లుగా అనిపిస్తుందని చెప్పడంతో ఆ మంట నుంచి ఉపశమనం కోసం ఉదయం నుంచి రాత్రి వరకు చెరువుల్లోనే మునిగి ఉండేవాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో దీర్ఘకాలిక వైద్యం చేయించలేక తల్లిదండ్రులు సాయం కోసం ఎదురుచూశారు.
అండగా నిలిచిన అనంత్ అంబానీ
ఈ సమస్య తీవ్రతను గుర్తించిన అనంత్ అంబానీ టీమ్ వెంటనే రంగంలోకి దిగింది. ఇక్బాల్‌ను ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేయించి, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రత్యేక వైద్య నిపుణుల బృందం బాలుడికి సమగ్ర పరీక్షలు నిర్వహించి చికిత్స అందించనుంది.
వైద్యుల హెచ్చరిక
గంటల తరబడి నీటిలో ఉండటం వల్ల చర్మానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం నీటిలో ఉండటం వల్ల చర్మం మెత్తబడి, పగుళ్లు ఏర్పడి దెబ్బతింటుంది. తీవ్రమైన ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పెరుగుతుంది. నీటిలో ఎక్కువసేపు గడపడం పరిష్కారం కాదని, బాలుడికి ఆ మంట ఎందుకు వస్తుందో లోతైన వైద్య నిర్ధారణ జరగాలని స్పష్టం చేశారు. అనంత్ అంబానీ చొరవతో నిపుణుల పర్యవేక్షణలోకి చేరిన ఇక్బాల్ త్వరలోనే కోలుకుంటాడని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
