చరిత్ర గర్భంలో దాగివున్న అపురూప ఘట్టం.. చెన్నకేశవ ఆలయంలో అరుదైన శాసనం.. దీని గురించి మీకు తెలుసా..
ఏలూరు శనివారపుపేటలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో అరుదైన చారిత్రక శాసనం వెలుగులోకి వచ్చింది. 1808 అక్టోబర్ 28న జమీందారు శ్రీ నృసింహ అప్పారావు నిర్వహించిన ‘తులాభార’ దాన విశేషాలను ఈ శాసనం వెల్లడిస్తోంది. తన శరీర బరువుకు సమానంగా మేలిమి బంగారం, నవరత్నాలను తూచి దానం చేసినట్లు శాసనంలో పేర్కొన్నారు. ఆలయ అర్చకులు, నర్తకీమణులు, సంగీత విద్వాంసులు, ఇతర సేవా సిబ్బందికి ఈ దానాన్ని పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.

ఏలూరు : చరిత్ర గర్భంలో దాగివున్న ఎన్నో అపురూప ఘట్టాలు భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఎపిగ్రఫీ విభాగం ఇప్పటికే వెలుగులోకి తెచ్చింది. శతాబ్దాల నాటి దాతృత్వానికి, ఆలయ సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఒక అరుదైన చారిత్రక శాసనం ఏలూరు, శనివారపుపేటలోని ప్రసిద్ధ శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థాన ప్రాంగణంలో కనుగొనబడింది. జమీందారు, శ్రీ నృసింహ అప్పారావు సమర్పించిన విశేష ‘తులాభార’ దాన విశేషాలు అక్కడ లభించిన శాసనం ద్వారా వెలుగులోకి వచ్చాయి. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయానికి ఉత్తర భాగంలో ఉన్న ముఖ మండప మెట్టు (సోపానం)పై ఈ శాసనం చెక్కబడి ఉంది. తెలుగు లిపిలో, సంస్కృత-తెలుగు భాషల సమ్మేళనంగా లిఖితమైన ఈ చారిత్రక రికార్డును పురావస్తు శాఖ 2013–14 వార్షిక నివేదిక (క్రమ సంఖ్య 43)లో అధికారికంగా నమోదు చేసింది. కాలగర్భంలో కలిసిపోకుండా ఆలయ మెట్లపైనే చెక్కుచెదరకుండా నిలిచివున్న ఈ అక్షర సంపద నాటి రాచరిక భక్తి ప్రపత్తులను, కళా పోషణను నేటికి స్పష్టంగా కళ్లకు కడుతోంది.
శక సంవత్సరం 1730 నాటి తులాభార మహోత్సవం:
శాసనంలో పేర్కొన్న కాలనిర్ణయం ప్రకారం.. ఇది శాలివాహన శక సంవత్సరం 1730, కార్తిక శుద్ధ దశమి, గురువారం నాటిది. అంటే ఆంగ్ల కాలమానం ప్రకారం 1808 అక్టోబర్ 28న ఈ తులాభార క్రతువు వైభవంగా నిర్వహించినట్లు తేటతెల్లమవుతోంది. నాటి పాలకుడు శ్రీ నృసింహ అప్పారాయ తన శరీర బరువుకు సరితూగే విధంగా (తులా ప్రమాణంలో కొలిచి) మేలిమి బంగారం, అమూల్యమైన నవరత్నాలను తూచి దానమిచ్చినట్లు శాసనం ద్వారా రూఢీ అయింది. సాధారణంగా రాజులు దేవాలయాలకు భూములు, ఆభరణాలు సమర్పించడం పరిపాటి కాగా, ఈ శాసనంలో ఒక ప్రత్యేకమైన మానవీయ, కళాపోషక కోణం గోచరిస్తుంది.
తులాభారంలో తూచిన స్వర్ణం, రత్నాలను కేవలం ఆలయ ఖజానాకే పరిమితం చేయకుండా.. స్వామివారి కైంకర్యాల్లో పాలుపంచుకునే ప్రధాన అర్చకులు, నిత్యం నాట్యసేవ చేసే నర్తకీమణులు, గానసేవ అందించే సంగీత విద్వాంసులు, ఆలయ ఇతర సేవా సిబ్బందికి సంపూర్ణంగా పంపిణీ చేసినట్లు శాసన పాఠం స్పష్టం చేస్తోంది. నాటి సమాజంలో ఆలయ కళలకు, కళాకారులకు లభించిన అత్యున్నత గౌరవానికి, రాజపోషణకు ఈ శాసనం తిరుగులేని నిదర్శనంగా నిలుస్తోంది. ఏలూరు ప్రాంత వైభవానికి, శనివారపుపేట చెన్నకేశవుని ఆధ్యాత్మిక చారిత్రక ప్రాధాన్యతకు ఈ ఆవిష్కరణ నూతన కాంతులను అద్దింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
