నీటి గెడ్డలో ఏదో కదలిక.. . అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూడగా..
శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో తీవ్ర విషాదం తప్పింది. గరుడకండి గ్రామ సమీపంలోని సవర గెడ్డలో గుర్రపుడెక్క, బురదలో చిక్కుకున్న ఓ వ్యక్తి సుమారు 30 గంటల పాటు నీటిలోనే ప్రాణాలతో పోరాడాడు. పొలాలకు వెళ్తున్న రైతులు అతడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఎస్సై దుర్గ ప్రసాద్, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్తులు కలిసి తాళ్ల సాయంతో అతడిని సురక్షితంగా బయటకు తీశారు.

గుర్రపుడెక్క.. పంట కాల్వలు, రిజర్వాయర్లు, గెడ్డలు, వాగుల్లో విస్తరించే ఈ జల మొక్కలు నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం కలిగిస్తాయి. వీటిని తొలగించడం నీటిపారుదల శాఖ అధికారులకు ప్రతి ఏటా అదనపు భారంగా మారుతోంది. అయితే గుర్రపుడెక్కను నిర్లక్ష్యం చేస్తే నీటి ప్రవాహం అడ్డుకోవడంతో పాటు.. ప్రమాదవశాత్తూ ఎవరైనా అందులో చిక్కుకుంటే ప్రాణాలతో బయటపడటం కూడా కష్టమే. శ్రీకాకుళం జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో గుర్రపుడెక్కలో చిక్కుకున్న ఓ వ్యక్తి సుమారు 30 గంటల పాటు నీటిలోనే ప్రాణాలతో పోరాడాడు. గరుడకండి గ్రామ సమీపంలోని సవర గెడ్డలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్రపుడెక్క, బురదలో చిక్కుకుని కదల్లేని స్థితిలో ఉన్న వ్యక్తిని స్థానిక రైతులు గుర్తించి.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు అత్యంత సాహసంతో అతడిని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.
వర్షాకాలంలో సవర గెడ్డలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. దీనికి తోడు గెడ్డలో భారీగా పేరుకుపోయిన గుర్రపుడెక్కలు మరింత ప్రమాదకరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుర్తుతెలియని ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ గుర్రపుడెక్కలోకి వెళ్లి బురదలో చిక్కుకున్నాడు. బయటకు రాలేక సుమారు 30 గంటల పాటు నీటిలోనే ఉండిపోయాడు. ఆకలి, చలి, నీరసంతో అతడు పూర్తిగా బలహీనపడిపోయాడు. చివరకు సహాయం కోసం కేకలు వేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పొలాలకు వెళ్తున్న కొంతమంది రైతులు గెడ్డలో ఏదో కదలికను గమనించారు. అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూడగా.. గుర్రపుడెక్క, బురద మధ్య ఓ వ్యక్తి చిక్కుకుని ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పలాస పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పలాస ఎస్సై దుర్గ ప్రసాద్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. అనంతరం పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానిక గ్రామస్తులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
గుర్రపుడెక్క, బురదలో లోతుగా చిక్కుకుపోయిన వ్యక్తిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. తాళ్ల సహాయంతో అతడిని నెమ్మదిగా బయటకు లాగారు. సుమారు 30 గంటల పాటు నీటిలో ఉండటంతో అతడు స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే 108 అంబులెన్స్‌ను రప్పించి పలాస సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ అతడికి చికిత్స అందించారు. అతడు గెడ్డలోకి ఎలా వెళ్లాడు? గుర్రపుడెక్కలో ఎలా చిక్కుకున్నాడు? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు అతడిని మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. అతడు మాట్లాడిన మాటలను బట్టి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. అతడి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో సవర గెడ్డలోని గుర్రపుడెక్కలు ఎంత ప్రమాదకరంగా మారాయో మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా వర్షాకాలంలో గెడ్డలు, వాగులు, నీటి వనరుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, స్థానిక రైతులు సూచిస్తున్నారు. ఎవరూ ఒంటరిగా గెడ్డలు దాటే ప్రయత్నం చేయవద్దని.. పిల్లలు, వృద్ధులను ప్రమాదకర ప్రాంతాల వైపు వెళ్లనివ్వవద్దని హెచ్చరిస్తున్నారు.
ప్రమాదాన్ని గుర్తించిన రైతులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఓ నిండు ప్రాణం నిలిచింది. దీంతో సహాయక చర్యల్లో పాల్గొన్న రైతులు, ఎస్సై దుర్గ ప్రసాద్, అగ్నిమాపక సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.
