Andhra News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మరో రెండు తుఫాన్ల ముప్పు.. భారీ వర్షాలే..
ఏపీకి మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శా హెచ్చరించింది. ఈ నెలాఖరున అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడి డిసెంబరు 4 తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉంది. డిసెంబరు రెండో వారంలో మరో తుఫాను కూడా సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెలాఖరున అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది డిసెంబరు 4వ తేదీ తర్వాత తుఫానుగా బలపడవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అంతేకాకుండా డిసెంబరు రెండో వారంలో బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని కూడా సూచించింది. ఇప్పటికే “ఆర్నబ్”, “మురసు” వంటి తుఫాన్ల కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ తుఫాన్ల బీభత్సం నుంచి ఇంకా కోలుకోనేలేదు. ఇటీవల ఏర్పడిన “ఆక్వాన్” తుఫాను చివరి నిమిషంలో తన దిశను మార్చుకుని, ఏపీపై ఎలాంటి ప్రభావం చూపకుండానే వెళ్లిపోవడంతో తీరప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుఫాన్ల సీజన్ ముగియకపోవడంతోసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుదల వంటి వాతావరణ మార్పుల కారణంగా వరుస తుఫాన్లు ఏర్పడుతున్నాయి.
ఈసారి వచ్చే తుఫాన్లు ఏపీతో పాటు తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వరుస తుఫాన్ల హెచ్చరికలతో తీరప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. ముఖ్యంగా కోత దశలో ఉన్న పంటలు తుఫాన్ల బారిన పడతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం.. రాబోయే తుఫాన్ల కచ్చితమైన దిశ, తీవ్రతపై ఇప్పుడే స్పష్టత ఇవ్వడం కష్టం. బంగాళాఖాతంలో వచ్చే వారం నాటికి మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అది అల్పపీడనంగా మారి, తుఫానుగా బలపడవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఎల్ నినో ప్రభావం, వెచ్చని గాలులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి కారకాలు తుఫాన్ల దిశ, తీవ్రత అంచనా వేయడాన్ని క్లిష్టతరం చేస్తున్నాయి. గతంలో “ఆక్వాన్” తుఫాను సైతం తీరం దాటే సమయానికి మూడు రకాలుగా దిశను మార్చుకుంది. చివరికి ఒడిశా వైపు వెళ్లి బలహీనపడటంతో ఏపీకి ప్రమాదం తప్పింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే తుఫాన్లు అదే విధంగా ప్రవర్తించకపోవచ్చని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తుఫాన్ల సీజన్ కాబట్టి సముద్రంలో వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గాలులు, ఉష్ణోగ్రతలను బట్టి తుఫాన్ల మార్గం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం తూర్పు గాలులు, ద్రోణి కారణంగా రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాంధ్రలో నాలుగు రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాాతావరణశాఖ స్పష్టం చేసింది.
