AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలులో బాలికల అక్రమ రవాణాకు యత్నం.. నిందితుడి అరెస్ట్

ధన్‌బాద్‌–అలప్పుజా ఎక్స్‌ప్రెస్‌లో మైనర్ బాలికలను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో రైల్వే పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్‌ నుంచి కాంచీపురం ఫ్యాక్టరీలో ఉద్యోగాల పేరుతో ముగ్గురు బాలికలు, ఓ బాలుడిని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు కథనం లోపల ...

రైలులో బాలికల అక్రమ రవాణాకు యత్నం.. నిందితుడి అరెస్ట్
Human Trafficking
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 23, 2026 | 5:24 PM

Share

రైలులో మైనర్ బాలికలను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో రైల్వే పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ధన్‌బాద్‌–అలప్పుజా ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ–బాపట్ల మార్గంలో ఈ ఘటన వెలుగుచూసింది. ముందస్తు సమాచారం మేరకు రైల్వే పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి రైలులో తనిఖీలు చేపట్టారు.

తెనాలి దాటిన తర్వాత ఓ బోగీలో ముగ్గురు బాలికలు, ఒక బాలుడు కనిపించారు. తనిఖీలు జరుగుతున్న విషయం తెలుసుకున్న వారితో ఉన్న ఓ వ్యక్తి పిల్లలను అక్కడే వదిలేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అప్రమత్తమైన పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం పిల్లలను ప్రశ్నించగా.. తాము జార్ఖండ్‌ నుంచి కాంచీపురం వెళ్తున్నట్లు తెలిపారు. కాంచీపురంలోని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, వారి తల్లిదండ్రులను ఒప్పించి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. అయితే నిందితుడు నిజంగానే ఉద్యోగాల కోసం పిల్లలను తీసుకెళ్తున్నాడా? లేక మరేదైనా కార్యకలాపాలకు వినియోగించాలనే ఉద్దేశం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పిల్లలను తెనాలి రైల్వే స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. అక్కడి నుంచి గుంటూరు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. ఇప్పటికే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు జార్ఖండ్‌ నుంచి వచ్చిన తర్వాత పిల్లలను అప్పగించనున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

రైళ్లలో పిల్లలతో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వ్యక్తులు కనిపిస్తే వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు రైళ్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Follow Us