Weather Alert: కొనసాగుతున్న వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

దేశమంతా వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. గుజరాత్‌ , మహారాష్ట్ర , మధ్యప్రదేశ్‌ , ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ముంబైలో మూడంతస్తుల భవనం కూలి ముగ్గురు చనిపోయారు. మహారాష్ట్ర లోని కొల్హాపూర్‌లో వరదల కారణంగా వందలాది ఇళ్లు నీట మునిగాయి.

Weather Alert: కొనసాగుతున్న వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Rain Alert
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 27, 2024 | 9:42 PM

దేశవ్యాప్తంగా వరద కష్టాలు కొనసాగుతున్నాయి. ఉత్తర భారతంతో పాటు మహారాష్ట్ర , కర్నాటక రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర లోని కొల్హాపూర్‌ వరదలతో విలవిలాడుతోంది. మహాలక్ష్మి కొలువుదీరిన అధ్యాత్మిక నగరంలో ఎక్కడ చూసినా వరదనీళ్లే కన్పిస్తున్నాయి. వందలాది ఇళ్లు నీట మునిగాయి. వరదనీటిలో పాములు కొట్టుకురావడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. గత మూడు రోజల నుంచి కొల్హాపూర్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. పంట పొలాలు కూడా నీట మునిగాయి. పుణే – బెంగళూర్‌ హైవే కూడా నీట మునిగింది. దీందో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మధ్యప్రదేశ్‌లో వరదలు వణికిస్తున్నాయి. బేత్వా జిల్లా నీట మునిగింది. వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయాలు కూడా నీట మునిగాయి.

ఉత్తరాఖండ్‌లో కూడా భారీవర్షాలతో జనజీవితం అస్తవ్యస్థంగా మారింది. కేదార్‌నాథ్‌ మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో ఛార్‌ధామ్‌ యాత్రను నిలిపివేశారు. ఉత్తరాఖండ్‌ లోని పలు జిల్లాలకు రెడ్‌అలర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ . రుద్రప్రయాగ్‌లో నదీ ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ , ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగం లోకి దింపారు.

గర్వాల్‌ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా రిషికేశ్‌ దగ్గర గంగానదిలో ప్రవాహం పెరిగింది. గంగానది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. తెహ్రీ జిల్లాల్లో భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం కావడంతో ఇద్దరు చనిపోయారు.

ముంబైలో భారీవర్షాల కారణంగా మూడంతస్తుల భవనం కుప్పకూలింది. నవీముంబైలో భవనం కూలడంతో ముగ్గురు చనిపోయారు. ఇద్దరిని శిథిలాల కింద నుంచి సహాయక సిబ్బంది కాపాడారు. ముంబైలో మరో రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అలర్ట్‌ జారీ చేసింది.

రెయిన్ అలర్ట్..

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కోస్టల్ కర్ణాటక, పశ్చిమ మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, తూర్పు రాజస్థాన్, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, ఉత్తరాఖండ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..