AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అణగారిన వర్గాలకు సహాయం లభిస్తుంది.. వక్ఫ్ బిల్లుపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..

Waqf Amendment Bill: దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత లోపించిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ముఖ్యంగా ముస్లిం మహిళలు, పేద ముస్లింలు, పస్మాండ ముస్లింల ప్రయోజనాలకు హాని కలిగించింది. పార్లమెంటు ఆమోదించిన చట్టాలు పారదర్శకతను పెంచుతాయి.. ప్రజల హక్కులను కాపాడతాయన్నారు. సామాజిక, ఆర్థిక న్యాయం, పారదర్శకతకు ఇది ఒక ముఖ్యమైన క్షణం.. అంటూ మోదీ పేర్కొన్నారు.

PM Modi: అణగారిన వర్గాలకు సహాయం లభిస్తుంది.. వక్ఫ్ బిల్లుపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Apr 04, 2025 | 3:41 PM

Share

పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్చలలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన.. అలాగే.. ఈ చట్టాలను బలోపేతం చేయడంలో దోహదపడిన ఎంపీలందరికీ తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. పార్లమెంటరీ కమిటీకి తమ విలువైన సూచనలను పంపిన ప్రజలందరికీ కూడా ప్రధాని మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విస్తృత చర్చ, సంభాషణల ప్రాముఖ్యత మరోసారి ధృవీకరించబడిందని.. ఇలాంటివి అవసరమంటూ పేర్కొన్నారు..

దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత లోపించిందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఇది ముఖ్యంగా ముస్లిం మహిళలు, పేద ముస్లింలు, పస్మాండ ముస్లింల ప్రయోజనాలకు హాని కలిగించిందన్నారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాలు పారదర్శకతను పెంచుతాయి.. ప్రజల హక్కులను కూడా కాపాడతాయని మోదీ పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక న్యాయం, పారదర్శకతకు ఇది ఒక ముఖ్యమైన క్షణం. చాలా కాలంగా అణగదొక్కబడిన ప్రజలకు సహాయం లభిస్తుంది. వక్ఫ్ బిల్లు ప్రజలకు గొంతుకగా నిలవడంతోపాటు.. అవకాశం కల్పిస్తుందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం..

వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. దాదాపు 12 గంటల పాటు జరిగిన సుధీర్ఘ చర్చ తర్వాత ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు పోలయ్యాయి. దీని తరువాత రాజ్యసభలో ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. దాదాపు 13 గంటల చర్చ తర్వాత, ఈ బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించింది.

రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత, ఈ బిల్లును రాష్ట్రపతికి పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది.

కొత్త ఉషోదయం.. కిరెన్ రిజిజు వక్ఫ్ బిల్లుపై ఏమన్నారంటే..

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ఈ బిల్లును ఉభయ సభలలో ఆమోదించారన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును కొత్త ఉషోదయంగా అభివర్ణించారు. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లు నేటి తరుణంలో అవసరమని అన్నారు. అందులో పారదర్శకత, జవాబుదారీతనం ఉన్నాయి. ఈ బిల్లు పేరు ఉమ్మిద్.. (ఆశ).. ఆశించడానికి ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. ఈ బిల్లు ఏ మతానికీ వ్యతిరేకం కాదంటూ పేర్కొన్నారు.

వక్ఫ్ బిల్లుపై కోటి మందికి పైగా సూచనలు..

మంచి ఉద్దేశ్యంతోనే ఈ బిల్లును తీసుకువచ్చామని కిరణ్ రిజిజు అన్నారు. వక్ఫ్ బిల్లును జెపిసిలో వివరంగా చర్చించారు. 10 నగరాలను సందర్శించి బిల్లుపై ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నారు. అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే బిల్లును రూపొందించారు. వక్ఫ్ బిల్లుపై కోటి మందికి పైగా ప్రజలు సూచనలు ఇచ్చారు. వక్ఫ్ ఆస్తిపై కొనసాగుతున్న వివాదం కారణంగా ఈ బిల్లు అవసరం. ఈ బిల్లుకు సంబంధించి 284 సంస్థలతో చర్చలు జరిగాయి. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ చేయలేనిది మోడీ ప్రభుత్వం చేస్తోంది.. అంటూ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..