Viral Video: భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. వాహనాలను రోడ్డుపై వదిలి నడుచుకుంటూ ఇంటికెళ్లిన ప్రయాణికులు! వీడియో

బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. కేవలం 2 కిలో మీటర్ల దూరానికి రోడ్లపై గంటలు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విసిగిపోయిన వాహనదారులు రోడ్లపైనే వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..

Viral Video: భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. వాహనాలను రోడ్డుపై వదిలి నడుచుకుంటూ ఇంటికెళ్లిన ప్రయాణికులు! వీడియో
Traffic In Bengaluru
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 24, 2024 | 4:32 PM

బెంగళూరు, అక్టోబర్‌ 24: ఆర్థిక నగరం బెంళూరులో వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తుంటే.. మరోవైపు రోడ్లపై బారెడు పొడవున గంటల కొద్దీ ట్రాఫిక్‌ నిలిచిపోతుంది. స్వల్ప దూరానికే గంటలు గంటలు రోడ్లపై వేచి చూడటం నగర పౌరుల సహనాన్ని పరీక్షకు గురి చేస్తుంది. రోడ్లపై ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ట్రాఫిక్‌లో నానా కష్టాలు పడుతున్న నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో ఉందంటే అక్కడి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. తాజాగా బెంగళూరు నగరంలో మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది.

బుధవారం సాయంత్రం బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దీంతో ఎలక్ట్రానిక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉద్యోగులంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం ఫ్లైఓవర్‌పై భారీగా జామ్‌ నెలకొంది. దాదాపు మూడు గంటలకు పైగా ఫ్లైఓవర్‌పైనే వాహనాలు నిలిచిపోయాయి. వరద నీటి కారణంగా, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్ ఒక వైపు మూసివేశారు. దీంతో రెండు గంటలకు పైగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు వేచిచూసిన కొందరు విసుగుతో తమ వాహనాలను రోడ్డుపైనే వదిలేసి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ప్లై ఓవర్‌ నిండా కార్లు, బైకులు వరుసగా నిలబడి ఉండటం కనిపిస్తుంది. పూర్తిగా గందరగోళం.. ఇలాంటి పరిస్థితిలో మెడికల్‌ ఎమర్జెన్సీ వస్తే బతికే అవకాశం లేదు. మడివాల వైపు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ దాదాపు పూర్తిగా జామ్ అయింది. వాహనాలు కేవలం 2 కి.మీ దూరానికి దాదాపు 2.30 గంటలకుపైగా కదలలేదు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రానికి సంబంధించిన అప్‌డేట్‌లను షేర్ చేసే కర్ణాటక పోర్ట్‌ఫోలియో పేరుతో మరొక వినియోగదారు, నెమ్మదిగా కదులుతున్న ట్రాఫిక్ మరియు ఫ్లైఓవర్‌పై నడుస్తున్న వ్యక్తుల వీడియోను అప్‌లోడ్ చేశారు. భారీ వర్షం కారణంగా బొమ్మనహళ్లి నుంచి ఎలక్ట్రానిక్‌ సిటీకి వాహనాలు నిలిచిపోవడంతో రెండు గంటలకు పైగా ట్రాఫిక్‌ నిలిచిపోయిందని యూజర్‌ అందులో తెలిపారు. బెంగళూరు ఐటీ హబ్‌కు వెళ్లే వారికి ఈ మార్గం ప్రధాన అనుసంధానం కావడంతో ప్రయాణికులు ట్రాఫిక్‌తో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతకుతున్నారు. వర్షాకాలంలో బెంగళూరు డ్రైనేజీ, ట్రాఫిక్ నిర్వహణ మెరుగు పరచడం ఎంతైన అవసరం అనే విషయాన్ని ఈ సంఘటన హైలైట్ చేస్తుందని మరొకరు రాశారు.

కాగా వర్షం పడితే బెంగళూరులో వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని వారాలుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. పలువురు ప్రాణాలను కోల్పోతున్నారు. మంగళవారం బెంగళూరు తూర్పు ప్రాంతంలోని హోరామావు అగరా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలగా దాదాపు 20 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించాలని ప్రభుత్వం కోరింది. పాఠశాలలు కూడా మూతపడ్డాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.