Rain Alert: అల్లకల్లోలం.. దూసుకొస్తున్న తీవ్ర తుఫాన్ దానా.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అల్లకల్లోలం.. దానా తుఫాన్ తీరం వైపునకు దూసుకొస్తోంది.. పెను తుఫాన్ గా మారి ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు దడపుట్టిస్తోంది. తీవ్రతుఫాన్ తీరం దాటక ముందే చాలాచోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ తీవ్ర తుఫాన్‌తో ఆంధ్రప్రదేశ్ లో సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా బలపడింది. దానా తుఫాన్ తీరం వైపునకు దూసుకొస్తోంది. గురువారం అర్థరాత్రి పూరి-సాగర్ ఐలాండ్ దగ్గర తీరందాటనుంది. తీరందాటే సమయంలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. దానా ప్రభావం ఒడిశా-బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువగా పడింది. ఒడిశాలోని పారాదీప్‌లో అత్యధికంగా 62 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేంద్రపరా జిల్లాలోని రాజ్‌నగర్‌లో కేవలం నాలుగు గంటల్లో 24 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాన్‌పై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని 14 జిల్లాలకు చెందిన 10 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
భద్రక్, బాలాసోర్, జాజ్‌పూర్, కటక్, ఖుర్దా, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపాడ, పూరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తోంది. బలమైన గాలులకు బాలాసోర్, పూరిలోని కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయని తెలిపారు అధికారులు. పూరీ ఆలయంలో దర్శనాలను రద్దు చేశారు అధికారులు. ఆలయంపై తుఫాన్ ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పశ్చిమ బెంగాల్‌పైనా దానా ప్రభావం పడింది. కోల్‌కతాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోల్‌కతా నగరంతో పాటు దక్షిణాది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పుర్బా, పశ్చిమ్ మెదినీపూర్, ఝార్‌గ్రామ్, కోల్‌కతా, హౌరా, హుగ్లీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్, తూర్పు సింగ్‌భూమ్ జిల్లాల్లోనూ భారీవర్షాలు పడే అవకాశం ఉంది.
ఏపీలో కూడా భారీ వర్షాలు..
ఏపీపై దానా తుఫాన్ స్వల్ప ప్రభావం చూపుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరకోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు, భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దానా తుఫాన్ తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. దానా తుఫాన్ ప్రభావం ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపై పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతం వెంబడి భారీ ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
తుఫాన్ ప్రభావంతో కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో 15 గంటల పాటు సేవలను నిలిపివేశారు. మరోవైపు 200లకు పైగా రైళ్లను రద్దు చేశారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
