తమిళనాడు పాలిటిక్స్‌లో ‘పర్సనల్ టార్గెట్స్’ సీజన్
తమిళనాడు పాలిటిక్స్‌లో పర్సనల్ టార్గెట్స్ సీజన్ నడుస్తోందిప్పుడు. సరిహద్దులు దాటిన రాజకీయ కక్ష్య.. దారి తప్పి వ్యక్తిగత విమర్శల వైపు తిరుగుతోంది. మొన్న విజయ్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ స్టేట్ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన 'అయ్యా.. అమ్మ' వ్యాఖ్యల వివాదం మరువకముందే.. ఇప్పుడు విజయ్-త్రిష సెల్యూట్‌పై డీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. మొత్తానికి.. తంబీల రాజకీయం మరీ వ్యక్తిగత విమర్శలవైపు వెళ్తున్నాయి.

కోలీవుడ్‌లో ఆ ఇద్దరి కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కానీ, ఈసారి సీన్ మారింది. వేదిక సినిమా థియేటర్ కాదు.. చెన్నైలోని చారిత్రాత్మక సెయింట్ జార్జ్ కోట. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తొలిసారి సీఎం హోదాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అయితే, ఈ అధికారిక వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ముందు వరుసలో కూర్చున్న త్రిష కృష్ణన్. పసుపు రంగు చీరలో మెరిసిపోతూ.. వీఐపీ గ్యాలరీలోని ఫ్రంట్ రోలో.. విజయ్ తల్లిదండ్రుల పక్కనే కూర్చుని ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు త్రిష. సీఎం విజయ్ జాతీయ జెండాను ఎగురవేసిన సమయంలోనూ ఎంతో గౌరవంతో సెల్యూట్ చేశారు. అది కామన్. ఎవరైనా చేసేదే. బట్.. ఆ తర్వాత అధికారిక కార్యక్రమాలను విజయ్ పరిశీలిస్తున్న సమయంలోనూ ఆమె సెల్యూట్ చేస్తూ మొబైల్‌లో ఫొటోలు తీస్తూ కనిపించారు.
ఇక పరేడ్ ముగించుకుని సీఎం విజయ్ ముందుకు సాగుతున్న తరుణంలో.. అక్కడ ఉన్న త్రిషకు సెల్యూట్ చేశారు. దానికి అంతే గౌరవంతో త్రిష కూడా సీఎం విజయ్‌కు నవ్వుతూ సెల్యూట్ చేశారు. అంతే.. ఈ ఒక్క క్లాప్ మూడు రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ వైరల్ అవుతోంది. దళపతి ఫ్యాన్స్ ఈ మూమెంట్‌ను ట్రెండ్ చేస్తుంటే.. రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది తీవ్ర దుమారానికి దారితీసింది.
ఈ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పత్రిక మురసోలి తీవ్ర విమర్శలు గుప్పించింది. అసలు ఏ అర్హత ఉందని, ఏం హోదా ఉందని త్రిషను ముందు వరుసలో కూర్చోబెట్టారని నిలదీసింది. మురసోలి తన సంపాదకీయంలో ఈ ఘటనను ఒక సిగ్గుచేటు దృశ్యంగా అభివర్ణించింది. ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఇలాంటి వ్యవహారం అసలేమాత్రం సముచితం కాదని మండిపడింది.
నిజానికి ఈమధ్య కాలంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో త్రిష హాజరు కావడం పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. మే నెలలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా ఆమె హాజరయ్యారు. ఆ వేడుక జరుగుతుండగా త్రిష తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. విజయ్, త్రిష చాలా ఏళ్లుగా అత్యంత ఆప్తమిత్రులుగా ఉంటున్నారు. వీరిద్దరి సాన్నిహిత్యంపై తరచూ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఎన్నో ఊహాగానాలు, ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు మురసోలి పత్రిక సైతం విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రచారాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శల డోస్ పెంచింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ముఖ్యమంత్రి విజయ్ హోదాకు ఉండాల్సిన గౌరవం గాలిలో కలిసిపోయిందని గట్టిగా విమర్శించింది. ఎలాంటి సంకోచం లేకుండా ఓ నటిని ముందు వరుసలో కూర్చోబెట్టి.. పదేపదే పరస్పరం సెల్యూట్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించింది. విజయ్‌కు ఓటు వేసిన వారే ఈ దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోయి ఉంటారంటూ మురసోలి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ పాలిటిక్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
