మరోసారి వార్తల్లో స్మగ్లర్ వీరప్పన్ ఫ్యామిలీ.. అసెంబ్లీ బరిలో భార్య, కూతురు.. మామూలు ట్విస్ట్ కాదుగా..
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 36 సంవత్సరాల పాటు పట్టు పడకుండా తప్పించుకుని తిరిగిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ వీరప్పన్ కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది.. వీరప్పన్ భార్య పెద్ద కుమార్తె ఇద్దరు తమిళనాడు ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే తల్లీ కూతుర్లు వీరిద్దరూ వేరువేరు పార్టీల్లో పోటీ చేస్తుండటం.. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ వీరప్పన్ భార్య.. పెద్ద కుమార్తె పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఎక్కడున్నాయి.. ఏయే పార్టీల నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకుందాం..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. అన్ని పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.. మాటల తూటాలతో రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మీ, పెద్ద కుమార్తె విద్యరాణి వేర్వేరు రాజకీయ పార్టీల తరఫున వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులోని కృష్ణగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ నుంచి వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి.. వెల్మురుగన్ నేతృత్వంలోని తమిళగ వజ్వురిమై కట్చి (TVK) తరపున ఆమె అభ్యర్థిగా బరిలోకి దిగారు. అలాగే వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యారాణి సేలం జిల్లాలోని మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి (NTK) అభ్యర్థిగా ఆమెను ప్రకటించారు.
వీరప్పన్ కుమార్తె విద్యారాణి ఒక లాయర్ గా విద్యావేత్తగా. ఆమె రాజకీయ ప్రస్థానం అనేక మలుపులు తిరిగింది. ప్రారంభంలో, ప్రధానంగా తన సామాజిక నేపథ్యం కారణంగా ఆమె పీఎంకేలో చేరారు. ఆ తర్వాత 2020లో బీజేపీలో చేరి, కృష్ణగిరి జిల్లాకు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పని చేసారు. ఆ సమయంలో, ప్రధానమంత్రి మోదీ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా కావేరీ సమస్య విషయంలో తమిళనాడు హక్కులను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ, ఆమె 2024లో సీమాన్ సమక్షంలో బీజేపీకి రాజీనామా చేసి నామ్ తమిళర్ కచ్చిలో చేరారు.
2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కృష్ణగిరి నియోజకవర్గంలో తొలిసారిగా పోటీ చేసిన విద్యారాణి, 1,06,260 ఓట్లు (9.15%) సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ నియోజకవర్గంలో గతంలో ఎన్‌టికెకు ఉన్న 2 శాతం ఓట్ల వాటాతో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. ప్రస్తుతం ఆమె సేలం జిల్లాలోని మెట్టూరు నియోజకవర్గంలో ఎన్‌టికె అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వన్నియర్ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నందున, ఆమె అభ్యర్థిత్వం పిఎంకె-ఎఐఎడిఎంకె కూటమికి గట్టి సవాలుగా పరిగణిస్తున్నారు. తన ప్రచారంలో విద్యారాణి, తన తండ్రి వారసత్వాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూనే, రైతుల సంక్షేమం, విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా దృష్టి సారిస్తున్నారు.
2025 మార్చిలో, ఎన్నికల సమయంలో ఆమె చేసిన అలుపెరుగని కృషికి గుర్తింపుగా, సీమాన్ విద్యారాణిని నామ్ తమిళర్ కచ్చి యువజన విభాగానికి రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించారు. ఆమె ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా పార్టీ యువ కార్యకర్తలను సమీకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఇదే ఎన్నికల్లో వీరప్పన్ భార్య, విద్యారాణి తల్లి ముత్తులక్ష్మి, తమిళగ వాళ్వూరిమై కచ్చి తరపున కృష్ణగిరి నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తల్లీకూతుళ్లు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారైనప్పటికీ, ఇద్దరూ వీరప్పన్‌ను “అడవుల సంరక్షకుడు – తమిళ జాతి సంరక్షకుడు”గా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈనెల 23 న జరగనున్న ఎన్నికల్లో వీరప్పన్ కుటుంబం నుంచి బరిలో దిగుతున్న ఇద్దరిలో గెలుపు జెండా ఎవరు ఎగరవేస్తారో అంటూ తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
