Karnataka Assembly: హీటెక్కిన కర్నాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. వీరసావర్కర్ ఫోటోపై.. బీజేపీ -కాంగ్రెస్ మధ్య డైలాగ్‌వార్
కర్నాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది. బెల్గాంలో కర్నాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ మహారాష్ట్ర ఏకీకరణ సమితి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీలో సావర్కర్ ఫోటో పెట్టడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.
బెల్గాంలో ప్రారంభమైన కర్నాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో వీరసావర్కర్ ఫోటో పెట్టడంపై బీజేపీ -కాంగ్రెస్ మధ్య డైలాగ్‌వార్ నడిచింది. మరోవైపు బెల్గాం లోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపాలని ఆందోళనలు జరగడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీలో వీరసావర్కార్ ఫోటో పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేశారు. సావర్కార్ దేశభక్తుడు కాదని, బ్రిటీష్ వాళ్లకు లొంగిపోయిన వ్యక్తి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సీఎల్పీ నేత సిద్దరామయ్య నేతృత్వంలో అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
అసెంబ్లీ బయట ధర్నా చేపట్టారు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా ధర్నాలో పాల్గొన్నారు. అయితే అసెంబ్లీలో సావర్కర్ ఫోటో పెట్టకపోతే దావూద్ ఇబ్రహీం ఫోటో పెడతారా అని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.
మహారాష్ట్రతో సరిహద్దు వివాదంపై రచ్చ
ఓవైపు బెల్గాంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మహారాష్ట్రతో సరిహద్దు వివాదంపై రచ్చ మళ్లీ మొదలయ్యింది. బెల్గాం లోకి మహారాష్ట్ర ఎమ్మెల్యేల బృందాన్ని అనుమతించాలని కర్నాటక లోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. కర్నాటక -మహారాష్ట్ర సరిహద్దు లోని టోల్‌ప్లాజా దగ్గర నిరసన చేపట్టారు. మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్గాం లోకి రావడానికి ప్రయత్నించిన శివసేన ఎంపీ ధరియాషీల్ మానేను కర్నాటక పోలీసులు అడ్డుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం