Vandalur Zoo Employees: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతుండగా.. వందలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా.. చాలా ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. కొన్నిచొట్ల ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులోని వండలూరు జంతుశాలలో కరోనా కలకలం రేపింది. వండలూరు జూగా పేరుగడించిన అరినగర్ అన్నా జూలాజికల్ పార్క్‌లో 80 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. గత రెండు రోజులుగా జరుపుతున్న పరీక్షల్లో 80 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమ సిబ్బందికి కూడా ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు జూ డైరెక్టర్ కరుణప్రియ తెలిపారు. శనివారం జరిపిన పరీక్ష ఫలితాల్లో 80 మంది సిబ్బందికి వైరస్ నిర్ధారణ అయినట్టు వెల్లడించారు . బాధితుల్లో ఎవరికీ లక్షణాలు లేవని, చికిత్స కొనసాగుతోందన్నారు.
కాగా.. జూలోని సిబ్బంది పెద్ద ఎత్తున కరోనా బారినపడడంతో వండలూరు జూను ఈ నెల 31 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం కరోనా పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని.. అప్పటివరకు జూను మూసివేయనున్నట్లు వెల్లడించారు. కాగా.. జంతువుల్లో కూడా లక్షణాలను పరిశీలిస్తున్నామని.. అవసరమైతే పరీక్షలు జరిపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదిలాఉంటే.. తమిళనాడు రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య 29 లక్షలు దాటగా.. ఇప్పటివరకు 36,967 మంది ఈ మహమ్మారితో మరణించారు. కేసులు పెరుగుతుండటంతో స్టాలిన్ ప్రభుత్వం.. కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. రాత్రిపూట కర్ఫ్యూ, ప్రతి ఆదివారాల్లో లాక్ డౌన్ లాంటివి అమలు చేస్తోంది.
Also Read: