AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి!

అగ్నిమాపక బృందం త్వరగా పిల్లలను NICU వార్డు నుండి తరలించడం ప్రారంభించింది. బృందం మొత్తం 50 మంది పిల్లలను రక్షించింది. వారిలో 10 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు.

మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి!
Hospital Fire
Balaraju Goud
|

Updated on: Nov 16, 2024 | 6:43 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చిల్డ్రన్స్ వార్డు (ఎన్‌ఐసియు)లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు చిన్నారులు కాలిపోయినట్లు సమాచారం. లోపల నుంచి 10 మంది చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని ఎన్‌ఐసియు (శిశువు) వార్డులో శుక్రవారం(నవంబర్‌ 15) రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడటంతో మెడికల్ కాలేజీలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. మంటలు అదుపులోకి రావడంతో బృందం ఎన్‌ఐసీయూ వార్డులోకి ప్రవేశించింది.

అగ్నిమాపక బృందం త్వరగా పిల్లలను NICU వార్డు నుండి తరలించడం ప్రారంభించింది. బృందం మొత్తం 50 మంది పిల్లలను రక్షించింది. వారిలో 10 మంది మరణించారు. 40 మందిని రక్షించారు. సమాచారం అందుకున్న వెంటనే ఝాన్సీ డీఎం అవినాష్‌కుమార్‌ ఉన్నతాధికారులతో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో మంటలు సిలిండర్ పేలడం వల్లే సంభవించినట్లు తెలుస్తోంది.

ఆరు అగ్నిమాపక దళ వాహనాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటి వరకు 40 మంది పిల్లలను తరలించినట్లు ప్రమాద సమయంలో మెడికల్ కాలేజీలో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. రెండు వార్డుల్లో 24-25 మంది పిల్లలు ఇప్పటికీ చిక్కుకుపోయారు. అప్పటికే లోపల మంటలు వ్యాపించాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టారు ఉన్నతాధికారులు.

మెడికల్ కాలేజీ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీ ఎన్‌ఐసీయూలో జరిగిన ప్రమాదంలో చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరమని, హృదయ విదారకమని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులను ఆదేశించారు. మరణించిన వారి ఆత్మలకు మోక్షం కలగాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడు శ్రీరాముడిని ప్రార్థిస్తున్నానన్నారు.

సీఎం యోగి ఆదేశాల మేరకు ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఝాన్సీ బయల్దేరి వెళ్లారు. ప్రమాదంపై విచారణ జరిపి 12 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఝాన్సీ కమిషనర్‌, డీఐజీని సీఎం ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు వెలుగులోకి రావడం విస్మయానికి గురిచేస్తోంది. వీడియోలో, వార్డు లోపల కేకలు , కుటుంబ సభ్యులు వేదనతో ఉన్నారు.

ఝాన్సీ డీఎం అవినాష్ కుమార్ మాట్లాడుతూ.. సంఘటనా స్థలంలో ఉన్న సిబ్బందికి అందిన సమాచారం మేరకు ఉదయం 10:30 నుంచి 10:45 గంటల మధ్య ఎన్‌ఐసీయూ లోపలి యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. NICUలో రెండు వార్డులు ఉన్నాయి. బయట వార్డులో ఉన్న పిల్లలంతా సురక్షితంగా బయటపడ్డారు. 10 మంది చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం. చాలా మంది చిన్నారులు గాయపడ్డారు. అందరూ చికిత్స పొందుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..