పరాకాష్టకు చేరిన ఆస్పత్రి నిర్లక్ష్యం.. విరిగింది కుడి చేయి.. ప్లాస్టర్ వేసింది ఎడమ చేతికి..!
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆరేళ్ల బాలిక కుడి చేయి విరిగితే, వైద్య సిబ్బంది పొరపాటున ఆమె ఎడమ చేతికి ప్లాస్టర్ వేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆస్పత్రి యాజమాన్యం అప్రమత్తమై విచారణకు ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆరేళ్ల బాలిక కుడి చేయి విరిగితే, వైద్య సిబ్బంది పొరపాటున ఆమె ఎడమ చేతికి ప్లాస్టర్ వేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆస్పత్రి యాజమాన్యం అప్రమత్తమై విచారణకు ఆదేశించింది.
సదర్ కోత్వాలి పరిధిలోని భుజౌలి కాలనీకి చెందిన అల్పనా ఉపాధ్యాయ్ తన ఆరేళ్ల కుమార్తె శంభవిని చికిత్స కోసం మహర్షి డియోరాహా బాబా వైద్య కళాశాలకు తీసుకువెళ్లారు. గాయపడిన బాలికకు వైద్యులు ఎక్స్‌రే పరీక్ష నిర్వహించగా, కుడి చేతిలో ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. అనంతరం ఆమెను ఆర్థోపెడిక్ విభాగానికి పంపించారు. అక్కడ వైద్యుడు కుడి చేతికి ప్లాస్టర్ వేయాలని సూచించినప్పటికీ, చికిత్స సమయంలో సిబ్బంది ఘోర పొరపాటు చేశారు. విరిగిన కుడి చేతికి బదులుగా ఎడమ చేతికి ప్లాస్టర్ వేశారు.
కొంతసేపటి తర్వాత ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వైద్యులను, ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. విషయం వెలుగులోకి రావడంతో ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. వెంటనే ముగ్గురు వైద్యులతో ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై విచారణ చేపట్టింది. దర్యాప్తులో ఆస్పత్రిలో అధిక రద్దీ కారణంగా సిబ్బందిపై పని భారం ఎక్కువగా ఉండటంతో ఈ మానవ తప్పిదం జరిగినట్లు కమిటీ గుర్తించింది. అయితే సంబంధిత ఆరోగ్య కార్యకర్త నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని నివేదికలో పేర్కొంది. కమిటీ సిఫార్సుల మేరకు ఆ ఉద్యోగిని వెంటనే ఆర్థోపెడిక్ విభాగం నుంచి తొలగించారు.
ఈ ఘటనపై స్పందించిన ఆస్పత్రి సీఎంఎస్ డాక్టర్ హెచ్.కె. మిశ్రా, బాధ్యుడైన ఆరోగ్య కార్యకర్తను విధుల నుంచి తప్పించామన్నారు. అతని ఒక వారం జీతాన్ని కూడా నిలిపివేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్య ఘటనలు పునరావృతం కాకుండా అన్ని విభాగాల సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల నాణ్యత, సిబ్బంది బాధ్యతపై మరోసారి చర్చ మొదలైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
