AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పత్తాలేకుండా పోయిన బ్యాంక్ ఉద్యోగి.. అనుమానంతో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయగా..

ఉత్తరప్రదేశ్‌లోని ఓ బ్యాంకులో భారీ మొత్తంలో బంగారం మాయమవ్వడం కలకలం రేపింది. భరౌల్ శాఖ లాకర్‌లో ఉన్న 96 బంగారు రుణ ప్యాకెట్లు కనిపించకుండా పోయాయి. కస్టోడియన్ మాయం కావడంతో అనుమానం పెరిగి లాకర్‌ను తెరిచారు. కోట్లలో విలువైన ఈ ఘటనపై ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులపై కేసు నమోదైంది.

పత్తాలేకుండా పోయిన బ్యాంక్ ఉద్యోగి.. అనుమానంతో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయగా..
Bank Locker
SN Pasha
|

Updated on: Jun 19, 2026 | 5:41 PM

Share

తమ ఇంట్లో ఉంటే పెద్ద మొత్తంలో బంగారం ఉంటే దొంగలు పడి మొత్తం దోచుకెళ్తారేమో అనే భయంతో చాలా మంది బ్యాంక్ లాకర్లకు రెంట్ కడుతూ అక్కడ దాచుకుంటారు. కానీ అక్కడ కూడా సేఫ్టీ లేకుంటే ఏం చేయాలి. తాజాగా ఓ బ్యాంక్‌లో భారీ మొత్తంలో బంగారం మాయమైంది. అయితే ఆ బ్యాంక్‌ ఉద్యోగులు కొంతమంది కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. ఇప్పటికే మీకు సీన్ అర్థమై ఉంటుంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది అనేది తెలుసుకునేందుకు పూర్తి వివరాల్లోకి వెళ్దాం..

బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. బ్యాంకు భరౌల్ శాఖ లాకర్‌లో భద్రపరిచిన 96 బంగారు రుణ ప్యాకెట్లు కనిపించకుండా పోవడంతో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో అప్పటి బ్రాంచ్ మేనేజర్‌తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులపై కేసు నమోదైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటావా జిల్లాలోని బస్‌గావ్ గ్రామానికి చెందిన బ్యాంకు సిబ్బంది, లాకర్ కీ కస్టోడియన్ దిలీప్ కుమార్ మే 27 నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యాడు. దీంతో లాకర్‌కు సంబంధించిన కార్యకలాపాలు నిలిచిపోయాయి. పలుమార్లు సంప్రదించినప్పటికీ అతడి నుంచి స్పందన రాకపోవడంతో బ్యాంకు యాజమాన్యానికి అనుమానం కలిగింది.

ఈ విషయాన్ని ఆగ్రా ప్రాంతీయ కార్యాలయానికి నివేదించగా, అధికారులు జూన్ 15న ప్రత్యేక బృందాన్ని భరౌల్ శాఖకు పంపారు. బ్యాంకు ప్యానెల్ న్యాయవాది శివ్ కుమార్ శర్మ సమక్షంలో, వీడియో రికార్డింగ్ నిర్వహిస్తూ డూప్లికేట్ తాళం చెవితో లాకర్‌ను తెరిచారు. తనిఖీ సమయంలో అందులో ఉండాల్సిన 96 బంగారు రుణ ప్యాకెట్లు కనిపించకపోవడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. గల్లంతైన బంగారం బరువు లేదా ఖచ్చితమైన విలువను ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించనప్పటికీ, దాని విలువ కోట్ల రూపాయల్లో ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై బ్యాంకు ఆగ్రా ప్రాంతీయ కార్యాలయం చీఫ్ మేనేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో మాజీ బ్రాంచ్ మేనేజర్ సందీప్ యాదవ్, కీ కస్టోడియన్ దిలీప్ కుమార్, క్రెడిట్ ఆఫీసర్ నరేష్ కుమార్‌లపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316(5) కింద నేరపూరిత విశ్వాస భంగం కేసు నమోదు చేశారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని, అదృశ్యమైన బంగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశామని ఆరాన్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రిషి కుమార్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా, బ్యాంకుల్లో భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us