లాక్షగృహ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న యూపీ ప్రభుత్వం

ఒక్క అయోధ్యనే కాదు...రామాయణ, మహాభారత ఇతిహాసాలతో సంబంధాలున్న ప్రతీ దర్శనీయ ప్రాంతాన్ని మనోహరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తోంది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం.. ప్రయాగ్‌రాజ్‌ నగరానికి ఓ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాక్షగృహ్‌ అన్న ప్రాంతాన్ని..

లాక్షగృహ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న యూపీ ప్రభుత్వం
Follow us

|

Updated on: Sep 24, 2020 | 2:13 PM

ఒక్క అయోధ్యనే కాదు…రామాయణ, మహాభారత ఇతిహాసాలతో సంబంధాలున్న ప్రతీ దర్శనీయ ప్రాంతాన్ని మనోహరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తోంది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం.. ప్రయాగ్‌రాజ్‌ నగరానికి ఓ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాక్షగృహ్‌ అన్న ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మలచాలన్న బృహత్కార్యానికి నడుం కట్టింది యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌. అక్కడో మహాభారత్‌ రిసెర్చ్‌ సెంటర్‌ను నిర్మించాలన్న ఆలోచనతో ఉంది ఉత్తరప్రదేశ్‌ పర్యాటకశాఖ! స్థానికంగా ఉన్న లాక్షగృహ్‌ పర్యాటన్‌ స్థల్‌ వికాస్‌ సమితి అనే సాంస్కృతి సంస్థ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.. లక్షాగృహ్‌ సుందరీకరణ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చిన టూరిజం శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ దినేశ్‌కుమార్‌ .. ప్రభుత్వం ఆదేశిస్తే మహాభారత్‌ రిసెర్చ్‌ సెంటర్‌ కూడా నిర్మిస్తామని అన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర నుంచి ఇందుకు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదన రాలేదని వివరించారు.. లాక్షగృహ్‌ స్థలానికి ఓ చరిత్ర, ఓ పవిత్రత ఉన్నాయని అంటోంది లాక్షగృహ్‌ పర్యాటన్‌ స్థల్‌ వికాస్‌ సమితి. మహాభారతంలో ఈ స్థల ప్రస్తావన ఉందని చెబుతోంది. ఇక్కడే ఉన్న హండియా గ్రామంలోనే లాక్షగృహ నిర్మాణం జరిగిందనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని సమితి కన్వీనర్‌ ఓంకార్‌ నాథ్‌ త్రిపాఠి అంటున్నారు. పాండవులు వారణావతంలో ఉండేందుకు ఇష్టపడుతున్నారని తెలుసుకున్న దుర్యోధనుడు….పురోచనుడు అనే వాస్తు నిపుణుని పిలిచి గంగా తీరంలో ఉన్న వారణావతంలో పాండవుల కొరకు లక్క, మట్టి, నెయ్యి మిశ్రమంతో చేసిన గృహాలను నిర్మించి వాటిలో పాండవులు ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి ఆ గృహాలను తగులపెట్టమని ఆదేశిస్తాడు. కౌరవుల కపటోపాయాన్ని ముందే పసిగట్టిన పాండవులు ఆ ఇంటి నుంచి భారీ సొరంగాన్ని తవ్వుకుంటారు.. ఆ బిలమే పాండవులను అగ్నికీలల నుంచి కాపడుతుంది.. గంగను దాటిస్తుంది.. మహాభారతం చెబుతున్న ఆ లాక్షగృహ నిర్మాణం జరిగింది ఇక్కడే అని చెబుతున్నారు ఓంకార్‌నాథ్‌ త్రిపాఠి. మహాభారత రిసెర్చ్‌ సెంటర్‌ను స్థాపించడానికి ఇంతకంటే అనువైన ప్రదేశం మరోటి ఉండదని అంటున్నారాయన. నిరుడు ఇక్కడ ఓ పెద్ద సొరంగం బయటపడిందని, అది పాండవులు తవ్వినదేనని చెబుతున్న ఓంకార్‌నాథ్ .. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.