Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ఆ సాహసం చేస్తారా? యూపీలో అక్కడి నుంచి పోటీచేస్తారా?
UP Elections 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ వేడుక్కుతున్నాయి. ఆ రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి.
UP Elections 2022: మరో ఆరు మాసాల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకూ వేడుక్కుతున్నాయి. ఆ రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాలకు వచ్చే ఏడాది(2022) ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. యూపీ ఎన్నికల్లో అధికార బీజేపీ, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ ఖాయంగా తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో తమ సత్తా చాటాలని అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం కూడా ఉవ్విళ్లూరుతోంది. యూపీ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. అక్కడ పార్టీకి పూర్వ వైభవం సాధించడమే లక్ష్యంగా ప్రియాంక గాంధీని ఇప్పటికే రంగంలోకి దించారు. ప్రియాంక గాంధీ సారథ్యంలోనే తమ పార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటుందని ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్..యూపీలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆమేనని చెప్పకనే చెప్పారు. దీంతో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సోనియాగాంధీ కుమార్తె స్వయంగా పోటీ చేస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇటీవల లక్నోలో జరిగిన కాంగ్రెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని సూచించారు. అటు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రియాంక గాంధీకి సూచించినట్లు సమాచారం.
ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి పోటీచేస్తారన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. తమ కుటుంబానికి కంచుకోటలాంటి యూపీలోని అమేథీ లేదా రాయ్‌బరేలి నియోజకవర్గాల పరిధిలోని ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం నుంచి ప్రియాంక పోటీచేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రస్తుతం ప్రాతినిథ్యంవహిస్తున్న రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీచేస్తే.. ఆమె గెలుపు నల్లేరుపై బండి నడక అవుతుందని స్థానిక కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అటు రాహుల్ గాంధీ గతంలో ప్రాతినిధ్యంవహించిన అమేథీ లోక్‌సభ నియోజకవర్గ పరిథిలోని అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమి చెవిచూశారు. ఇటీవల ఆమె తరచూ రాయ్‌బరేలి, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తుండటంతో అక్కడి నుంచే ఆమె పోటీ చేయొచ్చన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది.
ప్రియాంక గాంధీ అమేథీ వైపే మొగ్గుచూపే అవకాశముందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అక్కడ విజయం సాధించి గత ఎన్నికల్లో ఓటమికి స్మృతి ఇరానీపై ప్రతీకారం తీర్చుకోవాలన్నది ప్రియాంక యోచనగా సమాచారం. అమేథీ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలుపుకునేందుకు అక్కడి నుంచే పోటీ చేయాలన్న యోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఇక్కడి నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ బరిలో నిలిచేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని స్థానిక కాంగ్రెస్ నేతలు భావిస్తుంది. ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకుంటే అది సాహసమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అనారోగ్యం కారణంగా ఆమె ప్రాతినిధ్యంవహిస్తున్న రాయ్‌బరేలీలోనూ కాంగ్రెస్ బలహీనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న అక్కడి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే పార్టీ పుంజుకోగలదని స్థానిక కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తే పార్టీకి విజయావకాశాలు మెరుగుపడుతాయని యూపీ కాంగ్రెస్ నేతలు అంచనావేస్తున్నారు. ఆ మేరకు ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిస్తే.. నెహ్రూ కుటుంబం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన తొలి వ్యక్తి అవుతారు. ఇప్పటి వరకు నెహ్రూ కుటుంబానికి చెందిన అందరు లోక్‌సభ స్థానాల నుంచి మాత్రమే పోటీ చేశారు. అయితే ఈ విషయంలో ప్రియాంక గాంధీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమేథీతో పాటు రాయ్‌బరేలీలో విజయావకాశాలపై ఇప్పటికే ఆమె సర్వేలు చేయించినట్లు యూపీ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read..
Viral News: ఇద్దరు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్‌లలో రూ. 960 కోట్లు జమ.. అసలేం జరిగిందంటే.!
Viral Video: ఆనందంతో గాల్లో తేలిపోతున్న వధువు… ఆ సంతోషానికి గల కారణం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..