UP Elections 2021: యూపీలో యోగి కాదు.. ‘యోగ్య’ పాలన కావాలి.. ఎన్నికల సమర శంఖం పూరించిన అఖిలేష్
యూపీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఏకంగా యూపీ సీఎం నియోజకవర్గంలో తొడగొట్టారు.
UP Elections 2021: యూపీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఏకంగా యూపీ సీఎం నియోజకవర్గంలో తొడగొట్టారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బరిలోకి దిగిన ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడుతున్నాయి. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ అగ్ర నాయకులు పరస్పర విమర్శలతో రాజకీయ వేడి రగిలిస్తున్నారు. యూపీకి యోగి పాలన అవసరం లేదని.. ‘యోగ్య’ పాలన కావాలన్నారు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్.గోరఖ్‌పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ‘రథయాత్ర’ నిర్వహించారు. యోగి ప్రభుత్వం హయాంలో ఆజంగఢ్ ‘మాఫియా రాజ్’గా మారిందన్నారు. ఈ ప్రాంత ప్రతిష్ట మసకబారిందన్నారు. బీజేపీ విధ్వంసకర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. సీఎం యోగిపై కేసులు ఉపసంహరించుకుంటున్నారన్నారు అఖిలేష్.
ఇక, సమాజ్‌పార్టీ హయాంలో యూపీలో అభివృద్ధి జరిగింది సున్నా అన్నారు అమిత్ షా. అఖిలేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో సీఎం యోగితో కలిసి స్టేట్ యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేశారు. తాము ‘జామ్’ పాలన అందించామన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అంటే.. జిన్నా, ఆజంఖాన్, ముక్తార్ అన్సారీ అంటూ విమర్శించారు. ఇటీవల జిన్నాపై అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో అమిత్ షా ఇలా కౌంటర్ ఇచ్చారు. ఇక సీఎం యోగీ కూడా అఖిలేష్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన ములాయం, అఖిలేశ్ యాదవ్.. ఆజంగఢ్ అభివృద్ధికి చేసిందేమి లేదని విమర్శించారు. ఆజంగఢ్ పేరును ఆర్యగఢ్ గా మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.