Jasprit Bumrah: ‘ఛాంపియన్స్ ట్రోఫీ ప్రపంచానికి అంతం కాదు’.. అదే జరిగితే బుమ్రా టోర్నీకి దూరం.!
ఛాంపియన్స్ ట్రోఫీ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. భారత్ జట్టు ప్రాబబుల్స్ ను జనవరి 12న ప్రకటించనుంది భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు.. మరి ఈ జట్టు ప్రాబబుల్స్‌లో పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఉంటాడా.? లేడా.? అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా బౌలింగ్ చేయని సంగతి తెలిసిందే. అతడి వెన్నుకు గాయం కావడంతో.. మ్యాచ్ మధ్యలోనే అతడ్ని టీమ్ మేనేజ్‌మెంట్ స్కానింగ్ నిమిత్తం తరలించింది. బీసీసీఐ గానీ, టీమ్ మేనేజ్‌మెంట్ గానీ బుమ్రా గాయంపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏదైనప్పటికీ జస్ప్రిత్ గాయం మాత్రం తీవ్రమైనదిగా అనిపిస్తోంది.
అతడి గాయం అంత సీరియస్ కాకపోయి ఉంటే.. కచ్చితంగా కీలకమైన సిడ్నీ మ్యాచ్‌లో బౌలింగ్ చేసేవాడు. మరోవైపు బుమ్రా గురువారం ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు చేరుకోనున్నాడు. స్వదేశానికి వచ్చాక అతడు న్యూజిలాండ్ వైద్యుడితో సంప్రదింపులు జరిపే ఛాన్స్ ఉంది. అటు NCA వైద్యుల పర్యవేక్షణలోనూ ఉండనున్నట్టు తెలుస్తోంది. అటు టీమ్ మేనేజ్‌మెంట్ కూడా బుమ్రాపై ఒత్తిడి తీసుకురాకూడదని భావిస్తోందట. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రపంచానికి అంతం ఏమి కాదని.. ఏ చిన్న డౌట్ ఉన్నా.. అతడికి పూర్తి విశ్రాంతినిచ్చే ఛాన్స్ ఉందని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుమ్రా గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే అతడు నాలుగు నుంచి ఆరు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఎలాగో ఇంగ్లాండ్‌తో టీ20, వన్డేలు బుమ్రాకు విశ్రాంతిని ఇవ్వగా.. ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లలోనూ అతడు ఆడకపోవచ్చునని సమాచారం. దాదాపుగా నాకౌట్ మ్యాచ్‌లకు తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే బీసీసీఐ ఇంకా బుమ్రా గాయం తీవ్రతను ఇంకా నిర్ధారించలేదు. మరో రెండు లేదా మూడు రోజులలో కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, జనవరి 12న ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా తుది జట్టును ప్రకటించనుంది బీసీసీఐ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి