బంగాళాఖాతంలో వాయిగుండం.. జోరుగా వర్షాలు.. అక్కడ స్కూళ్లు, కాలేజీలు బంద్..
తీర ప్రాంతాల్లోని 10 జిల్లాలకు అలెర్ట్ ప్రకటించారు అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శీతాకాలం ముగిసి వేసవికాలం ప్రారంభమయ్యే సమయం ఇది. కానీ, తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో మాత్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షం జనజీవనాన్ని యస్తవ్యస్థంగా మార్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టినం, తిరువరూర్ జిల్లాల్లో అధికారులు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. కాగా, నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకలోని బట్టికలోవాకు 60 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడులోని కరైకల్‌కు 400 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నదని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది గురువారం తీరందాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే చెన్నై సహా తీర ప్రాంతాల్లోని 10 జిల్లాలకు అలెర్ట్ ప్రకటించారు అధికారులు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రామేశ్వరం పాంబన్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే నాగపట్నంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
ఈశాన్య ఆనుకుని ఉన్న తూర్పు భారతదేశం మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయువ్య భారతదేశంలో చలిగాలులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, ఫిబ్రవరిలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
— Tamilnadu Weather-IMD (@ChennaiRmc) February 1, 2023
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక వైపున తీరం తాకనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు అంతగా ప్రభావం ఉండబోదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీలో మాత్రం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఆ రాష్ట్ర వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..