పార్లమెంటులో శాతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వాడి వేడి చర్చ కొనసాగుతోంది. నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి ఆమిత్ షా ప్రవేశ పెట్టిన మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది లోక్ సభ. అయితే ఈరోజు జర్నలిస్టుల రక్షణ కోసం ఏర్పాటైన పాలసీ ఫ్రేమ్ వర్క్ పై చర్చ జరిగింది. ప్రతిపక్షాలు దీనిపై పలు ప్రశ్నలు సంధించాయి. దేశంలో జర్నలిస్టుల భద్రతను నిర్ధారించడానికి ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయా.. వాటి వివరాలు తెలియజేయాలని కోరింది. అలాగే ప్రస్తుతం జర్నలిస్టులు డిజిటల్ రూపంలో ఎదుర్కొంటున్న ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులపై వస్తున్న సవాళ్లను అధిగమించేలా ఎలాంటి చర్యలు చేపట్టిందో వివరించాలని అడిగారు. దీనిపై సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పందిస్తూ భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. నేరాలను నిరోధించడం, గుర్తించడం, నేరస్తులను శిక్షించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక బాధ్యత వహిస్తాయన్నారు. ఆయా ప్రాంతాల్లోని కొన్ని ఏజెన్సీల ద్వారా విచారణ చేపట్టేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
కేవలం జర్నలిస్టులకే కాకుండా దేశంలోని పౌరులందరి భద్రతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొంన్నారు. పౌరుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రస్తుత చట్టాలు జర్నలిస్టులకు కూడా వర్తిస్తాయన్నారు. జర్నలిస్టుల భద్రతపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు నిర్దిష్టమైన సలహాలను సూచిస్తుందని తెలిపారు. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని తీసుకువచ్చి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి 2017, అక్టోబర్ 20న కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) 1978 ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం, వార్తా సంస్థల ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఈ చట్టం ప్రకారం జర్మలిస్టులపై భౌతిక దాడి లేదా పత్రికా స్వేచ్ఛా పనితీరుపై జోక్యం చేసుకుంటే వారి నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు ఒక వేదికను రూపొందించినట్లు తెలిపారు. అదే విధంగా పత్రికా సంస్థలు, అందులో పనిచేసే పాత్రికేయులు ఏదైనా చర్యలను అతిక్రమిస్తే కూడా ఈ సంస్థ తగు చర్యలు తీసుకుంటుందని వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..