Aadhar for Kids: ఇకపై పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ కంటే ముందే ఆధార్ కార్డ్..ఎలా ఇస్తారంటే..
ఆసుపత్రుల్లో అప్పుడే పుట్టిన శిశువులకు ఆధార్ కార్డులను అందజేసేందుకు ఆధార్ కార్డు తయారీ సంస్థ యూఐడీఏఐ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం త్వరలో ఆసుపత్రుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రారంభించనున్నారు.
Aadhar for Kids: ఆసుపత్రుల్లో అప్పుడే పుట్టిన శిశువులకు ఆధార్ కార్డులను అందజేసేందుకు ఆధార్ కార్డు తయారీ సంస్థ యూఐడీఏఐ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం త్వరలో ఆసుపత్రుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రారంభించనున్నారు. అంతా ప్లాన్ ప్రకారం జరిగితే, పిల్లల జనన ధృవీకరణ పత్రం రాకముందే, వారికి ఆధార్ కార్డు ఉంటుంది. సాధారణంగా జనన ధృవీకరణ పత్రం పొందడానికి దాదాపు నెల రోజులు పడుతుంది. యూడీఐఏఐ(UIDAI) సిఈవో సౌరభ్ గార్గ్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, నవజాత శిశువులకు ఆధార్ నంబర్లను ఇవ్వడానికి తాము బర్త్ రిజిస్ట్రార్‌తో టైఅప్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వయోజన జనాభాలో 99.7% మంది ఆధార్ పరిధిలోకి వచ్చారని గార్గ్ చెప్పారు. దీని కింద ఇప్పటివరకు దేశంలోని 131 కోట్ల మంది జనాభా నమోదు చేసుకున్నారన్నారు. ఇప్పుడు తమ ప్రయత్నం నవజాత శిశువులను చేర్చుకోవడమని చెప్పారు. ఏటా రెండు నుంచి 2.5 కోట్ల మంది పిల్లలు పుడుతున్నారన్నారు. వాటిని ఆధార్‌లో నమోదు చేసే ప్రక్రియలో ఉన్నామనీ..బిడ్డ పుట్టినప్పుడు అతని/ఆమె ఫోటోను క్లిక్ చేయడం ద్వారా ఆధార్ కార్డు ఇస్తామనీ గార్గ్ వెల్లడించారు.
వివరాలను అప్‌డేట్ చేయడం..
ఈ విషయంపై గార్గ్ మరింత వివరంగా చెబుతూ మేము 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల బయోమెట్రిక్‌లను తీసుకోము. కానీ, దానిని వారి తల్లిదండ్రులలో ఒకరితో లింక్ చేస్తాము. 5 ఏళ్లు దాటిన తర్వాత పిల్లల బయోమెట్రిక్‌ను తీసుకుంటాము అని చెప్పారు. మొత్తం జనాభాకు ఆధార్ నంబర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. గత ఏడాది మారుమూల ప్రాంతాల్లో 10 వేల శిబిరాలు ఏర్పాటు చేశామనీ.. అక్కడ చాలా మందికి ఆధార్ నంబర్లు లేవని చెప్పారు. ఈ కసరత్తులో 30 లక్షల మంది నమోదు చేసుకున్నట్టు ఆయన తెలిపారు. తాము 2010లో మొదటి ఆధార్ నంబర్‌ను జారీ చేసామనీ మొదట్లో వీలైనన్ని ఎక్కువ మందిని ఎన్రోల్ చేయడంపైనే తమ దృష్టి ఉండేదనీ గార్గ్ చెప్పారు. ఇప్పుడు దాన్ని అప్‌డేట్ చేయడంపైనే తమ దృష్టి ఉన్నట్టు స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం దాదాపు 10 కోట్ల మంది తమ పేరు, చిరునామా, మొబైల్ నంబర్‌లను అప్‌డేట్ చేస్తున్నారు. 140 కోట్ల బ్యాంకు ఖాతాల్లో 120 కోట్ల ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయని వివరించారు.
ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయనున్నారు రానున్న కాలంలో ఓటర్ కార్డుతో కూడా ఆధార్‌ను అనుసంధానం చేయనున్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో బోగస్ ఓటింగ్‌ను నిరోధించడమే దీని ఉద్దేశం. ఎన్నికల సంఘం సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓటరు కార్డుతో ఆధార్‌ను లింక్ చేయడం వల్ల నకిలీ ఓటరు కార్డు వల్ల జరిగే మోసాలను అరికట్టవచ్చు.
ఇవి కూడా చదవండి: Dating Apps: వేగంగా విస్తరిస్తోన్న డేటింగ్ సంస్కృతి.. టాప్‌లో హైదరాబాద్.. సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..