AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్కూల్ నుంచి అంతరిక్షం వరకు.. గగన్‌యాన్ మిషన్ వ్యోమగామి అంగద్ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు

దేశం గర్వించదగ్గ ఘనకార్యాలు చేసినవారి గురించి విన్నప్పుడు వాళ్ల సక్సెస్ స్టోరీ, నేపథ్యం గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. "వారి బాల్యం ఎలా గడిచింది? ఏ పాఠశాలలో చదువుకున్నారు? కుటుంబ నేపథ్యం ఏంటి? ఎన్ని సవాళ్లను అధిగమించారు?".. ఇలా అనేక ప్రశ్నలు మదిలో తలెత్తుతాయి. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రరాజ్యాలతో ధీటుగా దూసుకెళ్తున్న భారతదేశం ఇప్పుడు మానవసహిత అంతరిక్ష యాత్రకు నడుం బిగించిన విషయం తెలిసిందే.

ఆ స్కూల్ నుంచి అంతరిక్షం వరకు.. గగన్‌యాన్ మిషన్ వ్యోమగామి అంగద్ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు
Mission Gagan Yaan
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Mar 16, 2024 | 2:55 PM

Share

దేశం గర్వించదగ్గ ఘనకార్యాలు చేసినవారి గురించి విన్నప్పుడు వాళ్ల సక్సెస్ స్టోరీ, నేపథ్యం గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. “వారి బాల్యం ఎలా గడిచింది? ఏ పాఠశాలలో చదువుకున్నారు? కుటుంబ నేపథ్యం ఏంటి? ఎన్ని సవాళ్లను అధిగమించారు?”.. ఇలా అనేక ప్రశ్నలు మదిలో తలెత్తుతాయి. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రరాజ్యాలతో ధీటుగా దూసుకెళ్తున్న భారతదేశం ఇప్పుడు మానవసహిత అంతరిక్ష యాత్రకు నడుం బిగించిన విషయం తెలిసిందే. మానవరహిత మంగళ్‌యాన్, చంద్రయాన్, ఆదిత్య ఎల్-1 యాత్రల విజయం తర్వాత తాజాగా చేపట్టిన మానవసహిత యాత్ర ‘గగన్‌యాన్’ కోసం నలుగురు వ్యోమగాములను ‘ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)’ ఎంపిక చేసి, అత్యంత కఠోరమైన శిక్షణనిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యనే గగన్‌యాన్ వ్యోమగాములను దేశ ప్రజలకు పరిచయం చేశారు. వారే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్‌ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా. వీరిలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ఆ నలుగురిలో ఒకరైన గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ గురించి.

Mission Gagan Delhi

Mission Gagan Delhi

ఈ అంగధుడు ఎక్కడివాడు?

గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ ఉత్తర్‌ప్రదేశ్‌లో నేడు ప్రయాగ్‌రాజ్‌గా పేరుమారిన నగరం అలహాబాద్‌లో 1982 జులై 17న జన్మించారు. పుట్టింది ఉత్తర్‌ప్రదేశ్ అయినా మూలాలు కేరళలో ఉన్నాయి. విద్యాభ్యాసం ఢిల్లీ, పూణే, హైదరాబాద్ నగరాల్లో సాగింది. అంగద్ తల్లిదండ్రులు బాలకృష్ణన్ నాయర్, కూలంఘాట్ ప్రమీల. భార్య లీనాకుమార్ మళయాల సినీ రంగంలో పేరుగాంచిన రచయిత్రి. ఆయనకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. బాల్యం కొన్నాళ్లు ప్రయాగ్‌రాజ్‌లో గడిచినా.. ఆ తర్వాత పాఠశాల విద్య పూర్తిగా ఢిల్లీలోనే సాగింది. ఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్స్ స్కూల్‌లో ఆయన 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)కి సెలెక్టయి పూణేలో శిక్షణ పొందారు. అనంతరం 2004 డిసెంబర్ 18న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన అంగద్.. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్నారు. సాయుధ బలగాల్లో అత్యంత ప్రతిష్టాత్మక ‘స్వార్డ్ ఆఫ్ హానర్’ అవార్డు హైదరాబాద్‌లో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో అందుకున్నారు. భారత వాయుసేనలో జాగ్వార్, డార్నియర్, హాక్, సుఖోడ్-30, మిగ్-21, మిగ్-29 వంటి యుద్ధవిమానాలను నడిపారు. 2,000 గంటలకు పైగా యుద్ధవిమానాలు నడిపిన అనుభవం ఆయన గడించారు. ఎప్పటికప్పుడు అధునాత శిక్షణ పొందడంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు. అమెరికాలోని అలబామాలో ఉన్న ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజిలో ఎయిర్‌క్రాఫ్ట్ మిలిటరీ ట్రైనింగ్ పొందారు. అలాగే వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజిలోనూ శిక్షణ పొందిన ఆయన కటింగ్ ఎడ్జ్ మిలటరీ టెక్నిక్స్ నేర్చుకున్నారు. విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న లోతైన అవగాహన, శారీరక ఫిట్‌నెస్ అన్నీ ఆయనకు వ్యోమగామిగా మారేందుకు ఉపయోగపడ్డాయి. రష్యాలోని గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్ (GCTC)లో 13 నెలల పాటు అత్యంత కఠోరమైన వ్యోమగామి శిక్షణ పొందారు.

Gagan Yaan

Gagan Yaan

ఢిల్లీ స్కూల్లో సన్మానం..

తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఇప్పుడు ఏకంగా ప్రపంచమే గర్వించదగ్గ స్పేస్ మిషన్‌లో భాగమైనందుకు ఆ పాఠశాల యాజమాన్యం ఆనందానికి అవధుల్లేవు. తమ పూర్వవిద్యార్థిని స్కూలుకు పిలిపించి మరీ సన్మానం చేశారు. సరిగ్గా 2000 సంవత్సరంలో ఆయన తన 12వ తరగతి విద్యను ఈ స్కూల్లో పూర్తి చేసుకున్నారు. అనంతరం పూణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్లారు. పాఠశాలలో చదువుకునే సమయంలోనే అంగద్ పట్టుదల, అంకితభావంతో పాటు కష్టపడి పని చేసే స్వభావం ఉండేదని పాఠశాల యాజమాన్యం గుర్తుచేసుకుంది. క్రమశిక్షణగా మెలిగే విద్యార్థి అంటూ స్ప్రింగ్‌డేల్స్ స్కూల్ మేనేజింగ్ బోర్డు చైర్మన్ శంకర్ రెడ్డి గుర్తు అన్నారు. వ్యోమగామి అంగద్‌ను పాఠశాల తరపున మేనేజింగ్ బోర్డ్ ఛైర్మన్ శంకర్ రెడ్డి, ప్రిన్సిపల్ జ్యోతి, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులను కూడా భాగస్వాములను చేస్తూ.. “ట్రయంఫ్ ఓవర్ ది మూన్- జూనియర్ స్కూల్” పేరుతో ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. సోరింగ్ హై- గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ విజయాలను ప్రదర్శించే విజువల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సన్మాన కార్యక్రమంలో వ్యోమగామి అంగద్ మాట్లాడుతూ తను చదివిన స్కూల్ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. భవిష్యత్ తరాలైన ప్రస్తుత విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. అప్పుడే విజయం సంకల్పిస్తుందని గెలుపు సూత్రం బోధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..