Dead Bodies In Rivers: మృతదేహాలు కొట్టుకు వచ్చిన నీటితో కరోనా వస్తుందా..? క్లారిటీ ఇచ్చిన నిపుణులు
Dead Bodies In Rivers: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గంగా, యమున నదుల్లో మృతదేహాలు కొట్టుకురావడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది....
Dead Bodies In Rivers: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గంగా, యమున నదుల్లో మృతదేహాలు కొట్టుకురావడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా అవి కోవిడ్ సోకి చనిపోయిన వారి మృతదేహాలన్న అనుమానం నది పరివాహక ప్రాంత ప్రజలకు మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అయితే మృతదేహాలు కొట్టుకువచ్చిన నీటి ద్వారా కరోనా వైరస్ వస్తుందేమోనని పరివాహక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఈ అనుమానాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
నదిలో మృతదేహాలు ప్రవహించే సమయంలో నీటిలో కరోనా వైరస్ బలహీనపడటం వల్ల సంక్రమించే ప్రభావం అంతగా ఉండదని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్ సతీష్ తారే అభిప్రాయపడ్డారు. ప్రవాహ సమయంలో నీరు శుద్ది కావడం సాధారణ జరిగే ప్రక్రియ అని, అలాంటి సందర్భాల్లో కొందరు ప్రజలు తాగునీటిని నేరుగా నది నుంచి తీసుకునే సందర్భాలున్నాయని, అలాంటి సమయంలో కొంత జాగ్రత్త పాటించాలన్నారు. గంగా, యమునా నదుల్లో మృతదేహాలను వేయడం కొత్తేమి కాదని, కానీ గత దశాబ్ద కాలం నుంచి వీటి సంఖ్య తగ్గిందన్నారు. ఇవి నదుల కాలుష్యానికి కారణమవుతున్నాయని అన్నారు. కరోనా నీటి ద్వారా సంక్రమణపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీటి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ ఇటీవల వెల్లడించారు.
అలాగే ఇద్దరు వ్యక్తులు దగ్గరగా ఉండి మాట్లాడుకోవడం, మాట్లాడినప్పుడు సూక్ష్మ బిందువులు పడిన ప్రదేశాన్ని మరో వ్యక్తి తాకడం వల్ల వైరస్ వ్యాపించే అవకాశాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు విజయ రామన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. నీటిలో డైల్యూషన్ కారణంగా సూక్ష్మజీవులు పలుచన పడిపోవడం వల్ల వైరస్ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువేనని పేర్కొన్నారు.
కాగా, బీహార్‌లోని బక్సర్ జిల్లాలోని గంగానదిలో దాదాపు 71 మృతదేహాలు కొట్టుకు రాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ నదిలో 55 మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. అవి కోవిడ్ మృతదేహాలని అనుమానం వ్యక్తం అవుతోంది. దీంతో పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాలు ప్రవహించిన నీటి వల్ల కరోనా వస్తుందన్న అనుమానాలపై నిపుణులు స్పష్టతనిచ్చారు.