ఓ వైపు ప్రపంచమంతా కనిపించని కరోనా వైరస్‌తో పోరాడితే.. మన భారత సైన్యం మాత్రం.. కరోనాతో పాటు.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. గత వారం రోజులుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. దేశంలోకి చొరబడి అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. వారికి బార్డర్లోనే మన సైన్యం చెక్ పెడుతోంది. తాజాగా.. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్ల, సోపోర్ ప్రాంతాల్లో.. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది.
సోపోర్ ప్రాంతంలో.. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం.. ఎదురుకాల్పులకు దిగింది.ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ సాజద్ దార్ హతమయ్యాడు. అతని మృతదేహం వద్ద ఏకే 47 రైఫిల్, మూడు మ్యాగజైన్స్, 59 రౌండ్ల బుల్లెట్లు దొరికినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.