Supreme Court: ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. అనర్హతపై తాము చట్టాలను రూపొందించలేమన్న ధర్మాసనం
ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత వేటుపై నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చట్టాన్ని పార్లమెంటే రూపొందించాలని అత్యున్నత న్యాయస్ధానం స్పష్టం.
Supreme Court on Party defection: ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత వేటుపై నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చట్టాన్ని పార్లమెంటే రూపొందించాలని భారత అత్యున్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. అనర్హత వేటు పిటిషన్లపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకునేలా స్పీకర్లకు మార్గదర్శకాలు జారీ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ సీనియర్ నేత రంజిత్ ముఖర్జీ. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
అనర్హతపై తాము చట్టాలను రూపొందించలేమని, అది పార్లమెంటు పరిధిలోని అంశమని ధర్మాసనం వెల్లడించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణీత సమయంలోగా స్పీకర్లు నిర్ణయం తీసుకోవడంలేదని ధర్మాసనానికి తెలిపారు పిటిషనర్ తరఫు న్యాయవాది అభిషేక్ దేబరాజ్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నిర్ణీత కాలవ్యవధిలో స్పీకర్ పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు న్యాయవాది. అయితే, కర్నాటక ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు తీర్పును చదివారా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ తీర్పును చదివి కోర్టుకు రావాలని సూచించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం 2 వారాల పాటు కేసు విచారణను వాయిదా వేసింది. కర్నాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో అప్పట్లో జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు స్పీకర్.
కాగా, భారత దేశం రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి ముఖ్యమైంది పార్టీ ఫిరాయింపులు. పలు రాష్ట్రాల్లో కూడా చాలామంది ఎమ్మెల్యేలు పార్టీలు మారుస్తూ.. అవసరమైతే అధికారాన్ని కూల్చడం సర్వసాధారణమైంది.