AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: ఆశావహులు, నేతలతో గాంధీభవన్‌ కిటకిట.. దరఖాస్తులు.. మరోవైపు చేరికలు..

Telangana Elections: ఓ వైపు అసెంబ్లీ టికెట్‌ కోసం అర్జీలు పెట్టుకునే ఆశావహులు.. మరోవైపు.. కాంగ్రెస్‌లో చేరుతున్న వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు.. ఇలా.. కొద్దిరోజులుగా గాంధీభవన్‌ కళకళలాడిపోతోంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆశావహులు, వారి అనుచరులతో సందడిగా మారింది. ఇక.. చేరికల సందర్భంగా.. బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు రేవంత్‌రెడ్డి.

Telangana Congress: ఆశావహులు, నేతలతో గాంధీభవన్‌ కిటకిట.. దరఖాస్తులు.. మరోవైపు చేరికలు..
Gandhi Bhavan
Sanjay Kasula
|

Updated on: Aug 23, 2023 | 9:20 PM

Share

కేసీఆర్ ఇచ్చిన ఊపుతో తెలంగాణా కాంగ్రెస్‌ కూడా అలర్ట్ అయింది. నిజానికి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు గాంధీభవన్‌లో ఆల్రెడీ మొదలైపోయింది. సీనియర్లు -జూనియర్లు అనే తేడా లేకుండా అందరికీ కలిపి యూనిఫామ్‌గా ఒకటే పద్దతి అమల్లోపెట్టేసింది టీ-కాంగ్రెస్ పార్టీ. కానీ.. తొందరపడి ఆగం కావొద్దంటోంది.. స్లో అండ్ స్టడీగా దూసుకెళ్దామంటోంది. అసలే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువున్న కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంపకం అనేది అతి పెద్ద ఛాలెంజ్‌గా కొనసాగుతోంది. రోజు రోజకు టికెట్ కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరిగింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్‌ కొనసాగుతోంది. ఎన్నికలకు మూడు నెలలు ముందే బీఆర్ఎస్‌ పార్టీ ఏకంగా అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్‌ పార్టీ.. టిక్కెట్‌ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ క్రమంలోనే.. అర్జీలతో ఆశావహులు, వారి అనుచరులు గాంధీభవన్‌కు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇప్పటివరకు 700లకు పైగా అర్జీలు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా.. నల్గొండ ఎమ్మెల్యే టికెట్‌ కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. వ్యక్తిగత, రాజకీయ వివరాలతో కోమటిరెడ్డి తరపున దరఖాస్తు చేశారు కాంగ్రెస్‌ నేతలు. దరఖాస్తుల స్వీకరణకు ఎల్లుండి లాస్ట్‌ డేట్‌ కావడంతో చివరి రెండు రోజుల్లో అర్జీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలావుంటే.. ఓ వైపు దరఖాస్తులు స్వీకరిస్తూనే… మరోవైపు చేరికలతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపుతున్నారు టీ.కాంగ్రెస్‌ నేతలు. మొన్నామధ్యనే బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ గూటికి చేరారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ వ్యవహారాల తెలంగాణ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. చంద్రశేఖర్‌కు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్‌ చేశారు రేవంత్‌రెడ్డి. 50 ఏళ్ల పాలనలో.. కాంగ్రెస్‌.. ఏం చేసిందనే అంశంపై చర్చకు కేసీఆర్‌ సిద్దమా అని సవాల్‌ విసిరారు. బీజేపీ, బీఆర్ఎస్‌, ఎంఐఎం ఒక్కటేనని.. ఆ మూడు పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు.. కమ్యూనిస్టులను కేసీఆర్‌ కరివేపాకులా వాడుకున్నారని ఆరోపించారు రేవంత్‌రెడ్డి.

మొత్తంగా… ఎన్నికల నోటిఫికేషన్‌ రాకుండానే తెలంగాణలో ఎలక్షన్‌ ఫీవర్‌ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇక.. టీ.కాంగ్రెస్‌ అయితే.. మరింత స్పీడ్‌ పెంచింది. ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తూనే.. వివిధ పార్టీల నుంచి చేరికలను కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. చాలాచోట్ల పార్టీ నేతల మధ్య విభేదాలు, ప్రకటనల ద్వారా గందరగోళం పెరిగే ప్రమాదం… ఇవన్నీ ఎలా అధిగమించాలి అనే వ్యూహరచన టీ-కాంగ్రెస్‌లో అంతర్గతంగా జరుగుతూనే ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం