కాఫీ తోటలో పని చేస్తున్న మహిళ.. అలికిడి విని పక్కకి చూడగానే షాక్!
రక్తం మరిగిన బెబ్బులి... మరోసారి తన పంజా విసిరి ఓ మహిళను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన తమిళనాడులోని వయనాడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల పులులు, చిరుత పులులు జనావాసాల్లో సంచరిస్తూ మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. రక్తం రుచిమరిగిన ఈ మృగాలు జంతువులనే కాదు, మనుషును కూడా చంపేస్తున్నాయి. కారణమేదైనా అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనాల్లోకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు.

వయనాడ్‌లో పెద్దపులి దాడిలో మహిళ మృతి చెందడంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. మనంతవాడి సమీపంలో కాఫీ తోటలో పని చేస్తున్న రాధపై పులి దాడిచేసింది. అనంతరం మృతదేహంలో కొంత భాగాన్ని పులి తినేసింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలా జరిగిందంటూ చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మనుషులపై అడవి జంతువులు దాడి చేయడం తగ్గిందంటూ అటవీశాఖ మంత్రి శశీంద్రన్ అసెంబ్లీలో ప్రకటించిన మరుసటి రోజు ఈ ఘటన చోటు చేసుకుంది.
క్రూర మృగాలు తమపై చేస్తున్న దాడులకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ప్రజలు మనంతవాడి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి ఆఫీస్ దగ్గర నిరసన చేపట్టారు. పదేళ్లలో జంతువుల దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నిసార్లు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఘటనపై ఎంపీ ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఈ ఘటన జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కాగా నరమాంస భక్షక పులిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైతే కాల్చి చంపాలని అటవీ శాఖ నిర్ణయించింది. పులిని గుర్తించి పట్టుకోవాలని, అవసరమైతే ప్రొటోకాల్ ప్రకారం ప్రాణాంతక చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్లు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ప్రమోద్ జి కృష్ణన్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




