KCR – Nitish Kumar: బీహార్ పర్యటనలో ఉన్న కేసీఆర్.. సీఎం నితీశ్‌కుమార్‌తో కలిసి గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. లఢఖ్ గల్వాన్ ఘర్షణల్లో అమరులైన 10 మంది బీహార్ సైనికులకు సీఎం కేసీఆర్ రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. బీహార్ పర్యటనలో భాగంగా పట్నా చేరుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ముందుగా ఆ రాష్ట్ర సీఎం నీతీశ్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున అమరుల కుటుంబాలకు నీతీశ్, తేజస్వీతో కలిసి చెక్కులు అందించారు. అంతేకాకుండా కొద్దినెలల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకూ రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. గాల్వాన్ అమరుల కుటుంబాలకు ఆదుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీహార్‌కు ఎంతో చరిత్ర ఉందంటూ పేర్కొన్నారు. బీహార్ నుంచి తెలంగాణకు.. లక్షలాది మంది కార్మికులు వస్తారని.. రాష్ట్ర అభివృద్ధిలో బీహార్ కార్మికుల పాత్ర ఉందని పేర్కొన్నారు. బీహార్లో మంచి ప్రభుత్వం ఉందన్నారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని.. ఆ సమయంలో బీహార్ కార్మికుల కోసం 150 రైళ్లు ఏర్పాట్లు చేసినట్లు గుర్తుచేశారు. గోదావరి తీరం నుంచి గంగా పరివాహక ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు.
Telangana CM K Chandrashekar Rao met CM Nitish Kumar and Deputy CM Tejashwi Yadav in Patna today. pic.twitter.com/lfw8DhBGnS
— ANI (@ANI) August 31, 2022
సీఎం కేసీఆర్ ప్రభుత్వం సాయంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ అభినందనలు తెలిపారు. అమరుల కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన గొప్పదని నితీశ్ తెలిపారు. అమరుల కుటుంబాలకు కేంద్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండగా ఉండాలని నితీశ్ తెలిపారు. ఎవ్వరూ చేయలేని పనిని కేసీఆర్ చేసి చూపించారని బీహార్ సీఎం పేర్కొన్నారు. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ 2001 నుంచి పోరాడుతున్నారని.. ఆయన్ను కాదనుకునే వారంటూ ఎవరూ ఉండరంటూ కొనియాడారు. తెలంగాణ ఆవిర్భావం నాటినుంచి మంచి మంచి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి