చెన్నై, అక్టోబర్ 24: రోడ్డుపై యువకుడు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఓ స్కూల్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు దాటుతున్న స్టూడెంట్‌ను అమాంతంగా బైక్ తో ఢీ కొట్టడంతో విద్యార్ధి 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్ధి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
తమిళనాడులోని కోయంబత్తూరులో అభిరామి థియేటర్ వద్ద ఓ స్కూల్ స్టూడెంట్ రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అటుగా బస్సు వచ్చింది. బస్సును ఓవర్‌టేక్ చేసేందుకు మోటర్‌బైక్ వాహనాదారుడు ప్రయత్నించాడు. బైక్‌ను గమనించని విద్యార్ధి బస్సు వచ్చేలోపు రోడ్డుదాటాలని ప్రయత్నించాడు. ఇంతలో బైక్ అదుపుతప్పి రోడ్డు దాటుతోన్న విద్యార్ధిని బలంగా ఢీకొట్టాడు. దీంతో విద్యార్ధి 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన విద్యార్థిని రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్ధి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక బైక్ నడుపిన యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. నిర్లక్ష్యంగా బైక్ నడిపిన యువకుడిని నజీర్‌గా పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు నజీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ప్రమాదానికి కారణమైన బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.