దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. జీవితకాలం ఎన్నికలకు..
కానీ, అక్కడితోనే సరిపెట్టేయడం సరికాదన్నది కొందరి అభిప్రాయం. క్రిమినల్ నేరం చేసిన వ్యక్తికి ప్రజలను పాలించే అర్హత ఎక్కడిది అని కొందరు వాదిస్తుంటే.. ఒకసారి పొరపాటున నేరం చేసినంత మాత్రాన జీవితాంతం ఎన్నికలకు దూరంగా పెట్టడం సరికాదని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా కోర్టులు తీసుకునే నిర్ణయాలు అయితే కావివి. అత్యున్నత న్యాయస్థానం అయినా సరే.. సొంతంగా ఆదేశాలు ఇవ్వలేవు...

క్రిమినల్ కేసులలో దోషులుగా తేలితే ఎన్నికల్లో పోటీపై జీవితకాలం నిషేధం. వినడానికి బాగున్నా.. దీని అమలు సాధ్యం కాకపోవచ్చు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు గనక నేరం చేసినట్టు రుజువైతే.. వారిని సర్వీసుల నుంచి శాశ్వతంగా తొలగిస్తారు. అదే తప్పు రాజకీయ నాయకులు చేస్తే మాత్రం అలా జరగదు. ఇప్పటికైతే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయొద్దనే నిషేధం అయితే ఉంది.
కానీ, అక్కడితోనే సరిపెట్టేయడం సరికాదన్నది కొందరి అభిప్రాయం. క్రిమినల్ నేరం చేసిన వ్యక్తికి ప్రజలను పాలించే అర్హత ఎక్కడిది అని కొందరు వాదిస్తుంటే.. ఒకసారి పొరపాటున నేరం చేసినంత మాత్రాన జీవితాంతం ఎన్నికలకు దూరంగా పెట్టడం సరికాదని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా కోర్టులు తీసుకునే నిర్ణయాలు అయితే కావివి. అత్యున్నత న్యాయస్థానం అయినా సరే.. సొంతంగా ఆదేశాలు ఇవ్వలేవు. ఇందుకు పార్లమెంట్ నిర్ణయంతో పాటు ప్రజల నుంచి ఒత్తిడి కూడా అవసరం. తీవ్రమైన నేరం కేసులో దోషులుగా తేలిన రాజకీయ నేతలను జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టులు నిషేధించలేవని సీజేఐ చంద్రచూడ్ గతంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. పైగా ఆరేళ్ల పాటు నిషేధం చాలు అని చట్టసభలే నిర్ణయించినప్పుడు.. జీవితకాల నిషేధం ఎలా విధించగలమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ప్రజాప్రతినిథ్యం చట్టం ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలపై హత్యా, అత్యాచారం, కిడ్నాప్ వంటి క్రిమినల్ కేసులు ఉన్నా వాటిలో దోషులుగా తేలితేనే అనర్హులుగా పరిగణిస్తున్నారు. శిక్ష అనుభవించిన నాయకులు మాత్రమే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని చట్టం చెబుతోంది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ.. దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిల్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది.
క్రిమినల్ కేసులో ఎంపీలు, లేదా ఎమ్మెల్యేలు దోషిగా తేలితే.. ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించే విషయంలో.. అందరికీ ఒకే రీతిన మార్గదర్శకాలు రూపొందించడం కష్టమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగని తమ చేతిలో ఏమీ లేదని మాత్రం చెప్పలేదు. లీడర్లపై తీవ్ర నేరాలు నమోదైన కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసే పూర్తి అధికారం హైకోర్టులకు ఉందని చెప్పింది. హైకోర్టులకు ఉన్న అధికారాలను ఉపయోగించుకుని.. కేసులను ఏడాదిలోగా పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టులను ఆదేశించింది సుప్రీంకోర్టు.
చట్టసభ సభ్యులపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించేలా అన్ని హైకోర్టులు సుమోటో కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు తప్పనిసరిగా ప్రత్యేక టైటిల్ ఏర్పాటు చేసి, అవసరాన్ని బట్టి ప్రత్యేక బెంచ్ పెట్టి, సీరియస్ అలిగేషన్స్ ఉన్న కేసులను లిస్ట్ చేయాలని సూచించింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మినహా.. పొలిటికల్ లీడర్ల కేసుల విచారణను ట్రయల్ కోర్టులు వాయిదా వేయకూడదని కూడా స్పష్టంగా చెప్పింది.
అంతా బాగానే ఉంది గానీ.. నేరం రుజువు చేయడానికి ఎంత సమయం కావాలి. వాయిదాల మీద వాయిదాలు కోరుతూ.. కేసు విచారణను దశాబ్దాల పాటు సాగదీసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. సో, అలాంటి కేసులను త్వరగా తేల్చాల్సిందేనంటూ 2015లో సుప్రీంకోర్టు ఓసారి తీర్పునిచ్చింది. నేతలపై కేసులను వేగంగా విచారించి, వారికి శిక్ష పడేలా చేయాలని ఆదేశాలిచ్చింది కూడా. కానీ 2015లో తీర్పు ఇస్తే.. 2020 వరకు అది అమలు కాలేదు. సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పుడు కేంద్రం కదిలింది.
ప్రతినిధులపై నమోదయ్యే కేసులను వేగంగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ పెట్టేందుకు ఒప్పుకుంది కేంద్రం. కానీ, ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలనే ఆదేశాలు కూడా సరిగా అమలు కావడం లేదు. ఇప్పటికీ కొన్ని వేల మంది ప్రజాప్రతినిధులపై కేసులు ఉన్నాయి. సుప్రీం తీర్పు వచ్చినా, ఏళ్లుగా వాళ్లపై విచారణలు సాగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో.. ఒకవేళ జీవితకాల నిషేధం వర్తించేలా చట్టాలు తీసుకొచ్చినా.. అసలు విచారణలు త్వరితగతిన అవుతాయా అనే సందేహాలు ఏర్పాడుతున్నాయి. అయితే, తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గమనిస్తే.. ఇక మీదటైనా సరే.. అలాంటి లీడర్ల కేసులను ఏడాదిలోగా తేల్చేయాల్సిందేనంటూ చెప్పినట్టే. సో, డెసిషన్ ఇప్పుడు హైకోర్టుల చేతిలో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఏ కేసులో ఎలాంటి సంచలనాలు ఉంటాయో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..