ఆధార్ లేదు మరి ! ఆకలి చావుల ‘ అదుపు ఎలా ‘ ? సుప్రీంకోర్టు సూటిప్రశ్న

జాతీయ ఆహారభద్రతా చట్టం కింద అందరికీ ఆహారం లభించేలా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకూ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా మీ స్పందన ఏమిటో తెలియజేయాలని కోరింది. ఈ చట్టం కింద అసలు మీ వద్ద దీనికి ప్రత్యామ్న్యాయంగా సమస్యల పరిష్కార వ్యవస్థ అంటూ ఉందా అని ప్రశ్నించింది. చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే, న్యాయమూర్తులుబీ.ఆర్. గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. […]

ఆధార్ లేదు మరి ! ఆకలి చావుల ' అదుపు ఎలా ' ? సుప్రీంకోర్టు సూటిప్రశ్న
Follow us
Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Dec 10, 2019 | 3:28 PM

జాతీయ ఆహారభద్రతా చట్టం కింద అందరికీ ఆహారం లభించేలా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకూ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా మీ స్పందన ఏమిటో తెలియజేయాలని కోరింది. ఈ చట్టం కింద అసలు మీ వద్ద దీనికి ప్రత్యామ్న్యాయంగా సమస్యల పరిష్కార వ్యవస్థ అంటూ ఉందా అని ప్రశ్నించింది. చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే, న్యాయమూర్తులుబీ.ఆర్. గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆకలి చావులను అరికట్టేలా రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ‘ పిల్ ‘ను ఈ బెంచ్ విచారించింది.

ఆధార్ కార్డు లేనిదే ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు వర్తింపజేయడంలేదని, దీంతో వారు ఆకలి చావులకు గురవుతున్నారని ఈ పిల్‌లో పిటిషనర్లు పేర్కొన్నారు. వీరి తరఫున వాదించిన అడ్వొకేట్ కొలిన్ గాన్‌సాల్వేస్.. అనేకమంది గిరిజనులు ఆధార్ కార్డు లేని కారణంగానో, లేదా తమ రేషన్ కార్డును ఆధార్‌తో ఎలా లింక్ చేసుకోవాలో తెలియకపోవడం వల్లో నష్టపోతున్నారని, వారికి ఆహార భద్రత అంటూ లేకుండాపోతోందని అన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ బాబ్డే.. ఆధార్ కార్డుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్న ధర్మాసనంలో తానూ ఒక సభ్యుడినని, ఆధార్ లేదన్న సాకుతో ఏ పథక ఫలాలనైనా ప్రజలకు ఆహారాన్ని అందించలేకపోవడం తగదని పేర్కొన్నారు. అందువల్లే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద తప్పనిసరిగా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ అంటూ ఉండాలన్నారు.

ఈ అంశాన్ని పరిశీలించేందుకు తాము ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు కావాలని కోరుతున్నామని, ఇందుకు తగినవారి పేర్లను సూచించాలని ఆయన పిటిషనర్ తరఫు న్యాయవాదిని కోరారు. అటు-కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ పిల్‌లో పేర్కొన్నట్టు మరణాలు ఆహార కొరత వల్ల సంభవించలేదని అన్నారు. అందరికీ ఆహార పథకాన్ని వర్తింపజేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సర్క్యులర్ జారీ చేసిందని ఆయన తెలిపారు.

ఝార్ఖండ్‌లోని కరిమతి గిరిజన ప్రాంతంలో సిమ్‌డేగా అనే గ్రామానికి చెందిన 11 ఏళ్ళ బాలిక సంతోషి.. 2017 సెప్టెంబరు 28న మరణించింది. పిడికెడు అన్నం కోసం అలమటించిన ఆ అమ్మాయి.. అది లభించక ప్రాణాలు కోల్పోయింది. ఆధార్ లేని కారణంగా తమకు రేషన్ దొరకలేదని, ఈ కారణంగా సంతోషి ఆకలి చావుకు గురైందని ఆమె తల్లి కొయిలీ దేవి, సోదరి గుడియా దేవి ఈ పిల్ దాఖలు చేశారు. ఆధార్ లేనందున తమ కుటుంబ రేషన్ కార్డును అధికారులు రద్దు చేశారని వారు పేర్కొన్నారు.